Reading Time: < 1 minute

వర్షాకాలం నాటికి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పరీక్షలు పూర్తవ్వాలి: మంత్రి ఉత్తమ్

Caption of Image.

 

  • వర్షాకాలం నాటికి మేడిగడ్డ, అన్నారం, 
  • సుందిళ్ల పరీక్షలు పూర్తవ్వాలి: ఉత్తమ్
  • సమస్యలుంటే సీడబ్ల్యూపీఆర్ఎస్ సహకారం తీసుకోండి
  • టెస్టులు పూర్తయితే ఆ వెంటనే డిజైన్లు ఇవ్వాలి
  • యాసంగిలో చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలని మంత్రి ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ బ్యారేజీ జియో టెక్నికల్ టెస్టులను ఈ వర్షాకాలం నాటికి పూర్తి చెయాలని అధికారులను ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. టెస్టులు ఎందుకు ఆలస్యం అవుతున్నాయని ప్రశ్నించారు. టెస్టుల బాధ్యతను ఇప్పటికే సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్(సీడబ్ల్యూపీఆర్​ఎస్) కు అప్పగించామని, ఏదైనా టెక్నికల్ సమస్యలు వస్తే వారి సహకారం తీసుకోవాలని సూచించారు. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు సంబంధించి ఇటీవల నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ రివ్యూ గురించి ఆరా తీశారు. మేడిగడ్డతోపాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లను త్వరగా ఇవ్వాలన్నారు. ఆదివారం జలసౌధలో అధికారులతో మంత్రి రివ్యూ నిర్వహించారు. ఈ వర్షాకాలం లోపు టెస్టులు పూర్తయితే ఆ వెంటనే డిజైన్లపై ఫోకస్ పెట్టాలని మంత్రి ఆదేశించినట్టు తెలిసింది. అయితే బ్యారేజీలో టెస్టులకు ఎదురవుతున్న సవాళ్లను మంత్రికి అధికారులు వివరించినట్టు తెలిసింది. ఖర్చుల విషయంలో ఏజెన్సీల తీరుపైనా మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం.

నీటిని సమర్థంగా వినియోగించాలి

రబీ సీజన్​లో చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందాలని అధికారులను మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. అన్ని ప్రాజెక్టుల్లోని నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. అన్ని చెరువులు రిజర్వాయర్లలో పూడికతీతపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. నీటిని సమర్థంగా వినియోగించుకునే బాధ్యత సీఈలదేనని స్పష్టం చేశారు. సమ్మర్ లో తాగునీటికి ఇబ్బందులు రావొద్దన్నారు. కాలువలు క్లోస్ చేసే నాటికి అన్ని చెరువులను నింపాలన్నారు. సాగర్ కింద ఇప్పటివరకు 6.30 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చామని, ఇంకా కావాల్సిన చోట నీళ్లు ఇవ్వాలన్నారు. జూరాల ప్రాజెక్టు రిపేర్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చెయ్యాలన్నారు. జూరాల బ్రిడ్జి నిర్మాణ ప్రాంతాన్ని త్వరగా ఖరారు చెయ్యాలని, బ్రిడ్జి కం బ్యారేజీగా నిర్మించేందుకు అందరూ సమ్మతించారన్నారు. లిఫ్టుల్లో పంపులను నిరంతరం నడపాలని, ఎప్పడు పడితే అప్పుడు ఆపి ఆన్ చేస్తే పంపులు దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు.

©️ VIL Media Pvt Ltd.