Reading Time: 2 minutes
Fake Milk Made Using Detergent And Urea In Mumbai Viral Video Shocks Netizens

ఇటీవలి కాలంలో మనం తినే ఆహారం అయినా, తాగే పానీయాలు అయినా అన్నీ కల్తీతో నిండిపోతున్నాయి. కారం తయారీలో ఇటుక పొడిని కలుపుతున్నారు, మసాలాల్లో చెక్క పొడిని కలిపి విక్రయిస్తున్నారు. అల్లం పేరుతో అరటితొక్కను ఉపయోగిస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారు. ఏ వస్తువును ముట్టుకున్నా కల్తీ తప్ప మరేమీ కనిపించని దయనీయ పరిస్థితి నెలకొంది.

ఇలాంటి నేపథ్యంలో వెలుగులోకి వచ్చిన ఓ ఘటన సమాజాన్ని షాక్‌కు గురి చేస్తోంది. బట్టలు ఉతకడానికి ఉపయోగించే సర్ఫ్‌, యూరియా, శుద్ధి చేసిన నూనెలు, సింథటిక్ రసాయనాలను ఉపయోగించి ఓ వ్యక్తి తన ఇంట్లోనే పాలను తయారు చేస్తున్నాడు. కేవలం లాభాల కోసమే కొందరు చేసే ఈ అనైతిక చర్యలు ప్రజల ప్రాణాలను తీవ్ర ప్రమాదంలోకి నెట్టుతున్నాయి.

దర్జాగా ఇంట్లో కూర్చుని రసాయనాలతో పాలు తయారు చేసి వాటిని ప్యాకెట్లలో నింపుతూ విక్రయిస్తున్నాడన్న సమాచారం అందడంతో అధికారులు అతడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన ముంబైలోని అంధేరి కపస్వాడి ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తోంది. ఓ నెటిజన్ ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది క్షణాల్లోనే వైరల్‌గా మారింది. దీంతో కల్తీ పాలు తయారు చేస్తున్న ఆ కేటుగాడిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడిపై కఠిన చర్యలు తీసుకుని జైలుకు పంపాలని డిమాండ్ చేస్తున్నారు.