Reading Time: 2 minutes
Pv Sindhu Stranded Dubai Airport Iran Israel War Updates

PV Sindhu: మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ .. ఇజ్రాయెల్-అమెరికా కూటమి మధ్య మొదలైన భీకర పోరు గల్ఫ్ దేశాలను అతలాకుతలం చేస్తోంది. శనివారం ఉదయం ఇరాన్ లక్ష్యంగా ఇజ్రాయెల్ విచక్షణారహితంగా దాడులు ప్రారంభించగా, ఇరాన్ కూడా క్షిపణులతో విరుచుకుపడింది. ఈ పరిణామాల మధ్య విమాన రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయారు. వారిలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

READ ALSO: Ayatollah Ali Khamenei: ఇరాన్‌లో ఖమేనీ శకం క్లోజ్.. అమెరికా-ఇజ్రాయెల్ ఉమ్మడి ఆపరేషన్‌లో సుప్రీం లీడర్ మృతి

మూతపడ్డ దుబాయ్ ఎయిర్‌పోర్ట్..
ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం యుద్ధం కారణంగా హఠాత్తుగా మూతపడింది. అమెరికా సైనిక స్థావరాలు ఉన్న దేశాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకోవడంతో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) పైకి కూడా క్షిపణులు దూసుకొచ్చాయి. అయితే, యూఏఈ సైన్యం వీటిని గాలిలోనే అడ్డుకుని నాశనం చేసింది. భద్రతా కారణ దృష్ట్యా విమాన సర్వీసులను నిలిపివేయడంతో ఎయిర్‌పోర్ట్ జనంతో కిక్కిరిసిపోయింది.

UK టోర్నమెంట్‌కు వెళ్తూ చిక్కుకున్న సింధు..
ప్రతిష్టాత్మకమైన ‘ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్’లో పాల్గొనేందుకు బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్‌కు వెళ్తున్న పివి సింధు, తన బృందంతో కలిసి దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. బ్రిటన్‌కు వెళ్లే క్రమంలో దుబాయ్‌లో విమానం మారాల్సి ఉండగా, ఈ లోపే యుద్ధం ముదరడంతో ఆమె అక్కడ ఆగిపోవాల్సి వచ్చింది. విమానాశ్రయం వెలుపల క్షిపణుల పేలుళ్లు, యుద్ధ వాతావరణం నెలకొనడంతో ప్రయాణికులంతా భయాందోళనకు గురవుతున్నారు. ఇరాన్ ప్రతీకార దాడులకు దిగుతుండటం, అమెరికా – ఇజ్రాయెల్ వైమానిక దాడులను తీవ్రతరం చేయడంతో గల్ఫ్ దేశాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకుపోయిన పివి సింధు, ఆమె బృందం క్షేమంగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే భారత ప్రభుత్వం, రాయబార కార్యాలయం అక్కడి భారతీయులను సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి.

READ ALSO: Ali Khamenei: ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఖతం.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన!