
మన తెలంగాణ/హైదరాబాద్: మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు చెల్లూరి నారాయణ రావు సహా తొమ్మిది మంది ఎపి డిజిపి హరీష్ కుమార్ గుప్తా ఎదుట లొంగిపోయారు. వీరి లొంగుబాటుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నక్సల్స్ రహిత రాష్ట్రంగా మారిందని డిజిపి ప్రకటించారు. లొంగిపో యిన మావోయిస్టుల నుంచి భారీగా ఆయుధ డంప్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.. మావోయిస్టు పార్టీలో అత్యంత కీలక నేత, ఆంధ్రాఒడిశా సరిహద్దు (ఏవోబి) స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి చెల్లూరి నారాయణరావు అలియాస్ సోమన్న పోలీసుల ఎదుట లొంగిపోయారు.
నారాయణ రావు తలపై రూ.25 లక్షల భారీ రివార్డు ఉందంటేనే ఆయన ప్రాధాన్యత అర్థం చేసుకోవచ్చు. ఆయనతో పాటు కర్తం లచ్చు (రూ.5 లక్షల రివార్డు), పోడియం రాజే, ముచ్చిక మాస, మడవి జోగి, కర్తం అడామే(తలో రూ. 4 లక్షల రివార్డు), మాదివి అడా మా, ముచ్చిక లక్ష్మణ్, కడితి హుర్రే (తలో రూ.1 లక్ష రివార్డు) వంటి ముఖ్య నేతలు లొంగిపోయారు. వీరికి ప్రభుత్వం తక్షణ సహాయంగా ఒక్కొక్కరికి రూ. 20,000 అందజేసి, కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు భరోసా కల్పించింది. పభుత్వ సంక్షేమ పథకాలు మారుమూల గ్రామాలకు కూడా చేరుతుండటం, ప్రస్తుతం పరిస్థితుల్లో చాలా మార్పు రావడంతో ఉద్యమ ఉనికి తగ్గుతోందని, అందుకే సాయుధ పోరాటాన్ని వీడి లొంగిపోయినట్లు సోమన్న వివరించారు.
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలానికి చెందిన నారాయణరావు దాదాపు 35 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్నాడు. 1989లో పీపుల్స్ వార్ గ్రూప్‌లో చేరిన ఆయన, క్రమంగా పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ మిలిటరీ ఆపరేషన్లలో ఆరితేరిన నేతగా గుర్తింపు పొందాడు. గత ఏడాది అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కీలక నేతలు గాజర్ల రవి, అరుణ మరణించిన తర్వాత, ఏవోబీ బాధ్యతల్ని సోమన్న చేపట్టారు. ఆయనపై ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఒడిశాలో పలు కేసులు నమోదయ్యాయి. ఎపి ప్రభుత్వం భారీ రివార్డును కూడా ప్రకటించింది. ఉద్దానం ప్రాంతం నుంచి వచ్చిన సోమన్న లొంగుబాటుతో మావోయిస్టు పార్టీకి పెద్ద దిక్కు కోల్పోయినట్లయింది.
గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు పరిస్థితులు మారాయని, ప్రజల్లోకి ప్రభుత్వ పథకాలు వెళ్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. సాయుధ పోరాటం ద్వారా సాధించేదేమీ లేదని గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ లొంగుబాటు ఏవోబి ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలకు గట్టి విఘాతంగా మారుతుందని భద్రతా దళాలు భావిస్తున్నాయి. గతంలో అగ్రనేతగా ఉన్న గణపతి వంటి వారు ప్రస్తుతం రాష్ట్రంలో లేరని, ఇతర రాష్ట్రాల విషయాల గురించి మాట్లాడలేమని అధికారులు స్పష్టం చేశారు. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఇప్పుడు పూర్తి శాంతి నెలకొందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
లొంగిపోయిన వారిపై చట్టపరమైన ప్రక్రియ యథావి ధిగా జరుగుతుందని, అదే సమయంలో వారి పునరావాసానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని హామీ ఇచ్చారు. హింస వల్ల సాధించేదేమీ లేద ని, అభివృద్ధి పథంలో భాగస్వామ్యం కావాలని ప్రభుత్వం ఇచ్చిన పిలుపు ఇవాళ సత్ఫలితాలను ఇచ్చింది. నక్సలిజం కోరల్లో చిక్కుకుని నలిగి పోయిన మారుమూల గ్రామాల్లో ఇప్పుడు అభివృద్ధి వెలుగులు ప్రసరించనున్నాయి. ఎపి పోలీసుల తెగువ, కేంద్ర ప్రభుత్వ దృఢ నిశ్చయం కలిసి రాష్ట్రాన్ని నక్సల్స్ ఫ్రీ స్టేట్‌గా నిలబెట్టాయి.