Reading Time: < 1 minute
ఎర్నాకులం ఎక్స్ ప్రెస్ లో మంటలు.. 2 బోగీలు పూర్తిగా దగ్ధం!

ఎలమంచిలి, డిసెంబర్‌ 29: విశాఖ జిల్లా దువ్వాడ మీదుగా ఎర్నాకుళం వెళ్లే టాటా-ఎర్నాకుళం(18189) ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ అగ్నికి ఆహుతైంది. ఆదివారం (డిసెంబర్ 29) అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. రాత్రి 1.30గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. రైలులోని ప్యాంట్రీ కారు పక్కపక్కనే ఉన్న బీ1, ఎం2 ఏసీ బోగీల్లో మంటలు చెలరేగాయి. వెంటనే గమనించిన లోకో పైలట్లు ఎలమంచిలి సమీపంలోని రైల్వే స్టేషన్‌లో రైలును నిలిపేశారు.

వెంటనే అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందించారు. దీంతో రైలులోని ప్రయాణికులు భయాందోళనలతో రైలు దిగి స్టేషన్‌లోకి పరుగులు పెట్టారు. అయితే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకునే లోపే 2 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. స్టేషన్‌ మొత్తం దట్టమైన పొగ వ్యాపించడంతో పరిసర ప్రాంతాలు భీతావహకంగా కనిపించాయి. అనకాపల్లి, ఎలమంచిలి, నక్కపల్లి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేసే ప్రయత్నం చేశారు.

అనకాపల్లికి నాలుగు గంటలు ఆలస్యంగా వచ్చిన ఈ ట్రైన్‌.. అక్కడి నుంచి బయలుదేరి నర్సింగబల్లి మీదగా వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. బీ1 ఏసీ బోగీ బ్రేక్‌లు పట్టేయడంతో మంటలు వ్యాపించినట్లు తెలుస్తుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.