Reading Time: < 1 minute

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పవన్ ఖేరాకు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారించిన ధర్మాసనం వారం రోజుల పాటు అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అప్పటిలోగా సంబంధిత కోర్టులో రెగ్యూలర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయాలని పిటిషనర్‌ను ఆదేశించింది. పవన్ ఖేరా మందస్తు బెయిల్ పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ కె.సుజన శుక్రవారం విచారించారు. పిటిషనర్ తరపున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ, సీనియర్ న్యాయవాది రవీందర్ రెడ్డి వాదనలు వినిపించారు. పిటిషనర్ భార్య స్థానిక సనత్ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారని, స్థానికంగా ఇక్కడే ఉంటున్నారని, ఈ పిటిషన్‌పై విచారించే పరిధి కోర్టుకు ఉంటుందని తెలిపారు. పిటిషనర్‌ను రాజకీయంగా ఎదుర్కోలేకనే తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని కోర్టుకు దృష్టికి తీసుకెళ్లారు. పిటిషనర్ గురించి అస్సాం సిఎం అనుచితంగా మాట్లాడడంతో పాటు ఢిల్లీలోని

ఆయన ఇంటికి సుమారు 100 మంది పోలీసులు పంపించడం వెనుక దురుద్దేశం ఉందన్నారు. అస్సాం ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది దేవజిల్ షైకీ వాదనలు వినిపిస్తూ పిటిషనర్‌పై నమోదయ్యింది సాధారణ పరువునష్టం కేసు కాదని, ఆరోపణలు చేయడానికి పలు నఖిలీ పత్రాలు వినియోగించారని కోర్టుకు తెలిపారు. పిటిషనర్ హైదరాబాద్ నివాసిని అంటూ కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని, ఢిల్లీలో శాశ్వత నివాసి అనడానికి ఆధారాలు ఉన్నాయని కోర్టుకు వివరించారు. కాగా, అస్సాం సిఎం హిమంత బిశ్వశర్మ భార్య రిణికి భూయాన్ శర్మకు మూడు పాస్ పోర్టులు, విదేశాల్లో ప్రకటించని ఆస్తులు చాలానే ఉన్నాయని, పవన్ ఖేరా చేసిన వ్యాఖ్యలకు గాను ఆయనపై గుహవాటి పోలీస్ స్టేషన్‌లో పరువునష్టం కేసు నమోదైంది. దీంతో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు మంగళవారం ఢిల్లీలోని ఇంటికి వెళ్లగా ఆయన అందుబాటులో లేకపోవడంతో పోలీసులు వెనుదిరిగారు. హైదరాబాద్ లో భార్య నీలిమ ఇంటికి వచ్చే అవకాశం ఉండటంతో అక్కడ పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే కేసులో తనను అరెస్ట్ చేయకుండా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో పవన్ ఖేరా పిటిషన్ దాఖలు చేశారు.