Reading Time: 2 minutes

కొత్త టాలెంట్ ను ప్రోత్సాహిస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్న సినిమా ‘తిమ్మరాజుపల్లి టీవీ‘. తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంతో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్స్‌గా పరిచయమవుతున్నారు. ‘తిమ్మరాజుపల్లి టీవీ‘ చిత్రంతో వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. హైదరాబాద్‌లో ‘తిమ్మరాజుపల్లి టీవీ‘ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో డైరెక్టర్ వి.మునిరాజు మాట్లాడుతూ.. ‘అంతరించిపోయిన వస్తువులను మ్యూజియంలో పెడుతుంటారు. అలాంటి మ్యూజియం మీరు తెరపై చూడాలంటే మా సినిమాను ఈనెల 17న చూడండి. ఎందుకంటే మా సినిమా ఒక మ్యూజియంలా ఉంటుంది. అందులో అంతరించిపోతున్న మన కల్చర్, జ్ఞాపకాలు, టీవీ గురించి ఉండే ఎమోషన్స్ ను చూస్తారు. ఇది తిమ్మరాజుపల్లి స్టోరీ మాత్రమే కాదు మన రెండు తెలుగు రాష్ట్రాల వారి స్టోరీ. మొత్తం ఏపీ, తెలంగాణలో 40 ఫ్లస్ ఏజ్ ఉన్నవాళ్లు దాదాపు 5 కోట్ల మంది ఉంటారు. వారందరికీ ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. అలాగే ఫామిలీస్ కి అందరికీ ఈ సినిమా నచ్చతుంది” అని తెలియజేశారు. హీరో సాయి తేజ్ మాట్లాడుతూ.. “మన లైఫ్ లో మొదటిసారి ఎక్సిపీరియన్స్ చేసేవన్నీ ఒక మంచి ఫీల్ ను ఇస్తాయి. మొదటిసారి తిన్న అమ్మచేతి ముద్ద ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అలా మన లైఫ్ లో చూసే స్వీట్ మెమొరీస్ ఈ చిత్రంలో ఉంటాయి‘ అని అన్నారు.

నిర్మాత కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. “మా మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన విక్టరీ వెంకటేష్‌కు థ్యాంక్స్ చెబుతున్నాం. ఆయన సినిమా రిలీజ్ అయ్యిందంటే ఇంటిల్లిపాదీ థియేటర్స్ కు వెళ్లేవాళ్లం. మా చిన్నతనంలో టీవీలో కొత్త సినిమా వచ్చినా, వీసీడీల్లో కొత్త మూవీ చూసినా ఎంతో హ్యాపీగా ఉండేది. అలాంటి హ్యాపీనెస్ ఇప్పటితరం వారికి చూపించాలనే అప్పటి హీరో, హీరోయిన్స్ గెటప్స్ లో ఈ రోజు మీ ముందుకు వచ్చాం. చెన్నకేశవరెడ్డి, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు సినిమాలు నాకు బాగా ఇష్టం. అందుకే ఈ రోజు చెన్నకేశవరెడ్డి గెటప్ లో వచ్చాను. బాలకృష్ణ కి థ్యాంక్స్. అలాగే వింటేజ్ హీరోలందరికీ థ్యాంక్స్. మా చిత్రంలో పనిచేసిన వాళ్లందరి కల సినిమా. ఆ కల తీరేందుకు ఒక్కొక్కరికి ఒక్కో టైమ్ పట్టింది. వాళ్లు మా మూవీ కోసం రెండేళ్లు కష్టపడ్డారు.టెక్నికల్ బ్రిలియన్స్, ఆర్టిస్టుల బ్రహ్మాండమైన పర్ ఫార్మెన్స్‌లు, ఊరిలోని ఆహ్లాదకరమైన వాతావారణం.. ఈ మూడు చూసేందుకు మా మూవీకి వెళ్లండి. ఈ వేసవికి సమ్మర్ వెకేషన్ ఊరికి వెళ్లినట్లే. ఈ సారి మా తిమ్మరాజుపల్లికి రండి. మీ ఊరు గుర్తుస్తుంది, అప్పటి జ్ఞాపకాలు గుర్తుకువస్తాయి. ఇది నేను గ్యారెంటీ ఇస్తున్నా ‘ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో హీరోయిన్ వేద జలంధర్,తో పాటు చిత్ర బృందం పాల్గొంది.