
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ గడ్డపై హిందూ ధర్మ రక్షణ, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జీవితాంతం పోరాడిన యోధుడు ఆలె నరేంద్ర అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు కొనియాడారు. గురువారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నరేంద్ర 12వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఫొటోకు రాంచందర్ రావు నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. హైదరాబాద్‌లోని పాతబస్తీలో హిందువుల రక్షణ కోసం ఆలె నరేంద్ర చేసిన కృషి మరువలేనిదన్నారు. మత కల్లోలాల సమయంలో ప్రాణాలకు తెగించి హిందువులను కాపాడారని పేర్కొన్నారు.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో నరేంద్ర పోషించిన పాత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పారు. తెలంగాణలో రామరాజ్యాన్ని స్థాపించడమే లక్ష్యంగా బీజేపీ ముందుకు సాగుతుందని, అదే ఆయనకు మనం ఇచ్చే అసలైన నివాళి అని పేర్కొన్నారు. ఎమ్మెల్యే హరీశ్‌బాబు, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.