Reading Time: 2 minutes

మన తెలంగాణ/హైదరాబాద్: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) హైదరాబాద్, ములుగు జిల్లాలోని సమ్మక్క-సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం మధ్య శుక్రవారం అవగాహన ఒప్పందం కుదిరింది. ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బి.ఎస్. మూర్తి, వైస్-చాన్సలర్ ప్రొఫెసర్ వై.ఎల్.శ్రీనివాస్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరయిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో గిరిజన విశ్వ విద్యాలయం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు. ఈ విశ్వ విద్యాలయాన్ని ములుగు జిల్లాలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన వినతికి ప్రధాని నరేంద్ర మోడీ సుముఖత వ్య క్తం చేశారని ఆయన చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, డీఆర్డీఓ మాజీ చై ర్మన్ డాక్టర్ జి.సతీష్‌రెడ్డి సమక్షంలో ఈ ఒప్పందం ద్వారా జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా కొత్త పాఠ్య ప్రణాళికలను రూపొందించనున్నారు.

అలాగే అధ్యాపకులకు శిక్షణ, మార్గదర్శకత్వం అందించి సంస్థాగత సామర్థ్యాన్ని పెంపొందించనున్నారు. ఎస్‌ఎస్‌సిటియు(సమ్మక్క సారలమ్మ ట్రైబల్ యూనివర్శిటి)లో పరిశోధనలను ప్రోత్సహించేందుకు ప్రయోగశాల మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంతో పాటు ఇంటర్న్‌షిప్, వర్క్‌షాపు, నిపుణుల ఉపన్యాసాలు నిర్వహించి విద్యార్థులు, అధ్యాపకుల నైపుణ్యాలను మెరుగుపరచనున్నారు. అలాగే ఎస్‌ఎస్‌సిటియు అధ్యాపకులకు ఐఐటీ హైదరాబాద్ ప్రత్యేక శిక్షణ అందించనుంది. బోధనలో మెళుకువలు పెంపొందించేందుకు వర్క్‌షాప్‌లు, సెమినార్లు, అతిథి ఉపన్యాసాలను నిర్వహిస్తారు. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఎస్‌ఎస్‌సిటియులో సాంకేతిక కోర్సుల నిర్వహణకు ఐఐటీ హైదరాబాద్ సహకారం అందిస్తుంది. ఈ క్రమంలో కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో బీటెక్, మ్యాథమెటిక్స్, కంప్యూటింగ్ లో బీఎస్, కంప్యూటర్ సైన్స్, డేటా అనలిటిక్స్లో బీఎస్ వంటి కోర్సులు ప్రారంభించనున్నారు. ఈ కోర్సులను బోధించే ఎస్‌ఎస్‌సిటియు అధ్యాపకులకు శిక్షణ బాధ్యతను ఐఐటీ హైదరాబాద్ చేపడుతుంది.

ఐఐటీ హైదరాబాద్ మార్గదర్శకత్వంలో నిర్వహించే అడ్వాన్‌స్డ్ టెక్నాలజీ కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు, ముఖ్యంగా తెలంగాణ విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది. మారుమూల ప్రాంతంలో ఉన్న ఈ కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం మరింత అభివృద్ధి చెందుతూ, ప్రాంతీయ విద్యా అభివృద్ధికి దోహదం చేయనుంది. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ములుగులో ఏర్పాటు చేయనున్న గిరిజన విశ్వవిద్యాలయానికి ‘సమ్మక్క-సారక్క’ అమ్మవార్ల పేరును పెట్టాలని తాను ప్రధాని నరేంద్ర మోడీని కోరడంతో వెంటనే అంగీకరించినట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రజలు, దేశవ్యాప్తంగా ఉన్న గిరిజనుల తరఫున ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈ విశ్వవిద్యాలయానికి తాత్కాలిక క్యాంపస్‌ను ములుగులో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న రెండు ప్రముఖ కేంద్ర విద్యాసంస్థలు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్‌కు ఈ గిరిజన విశ్వవిద్యాలయం అభివృద్ధికి సహకరిస్తున్నాయని ఆయన తెలిపారు. సెంట్రల్ యూనివర్సిటీ మొదటి నుంచే అవసరమైన మద్దతు అందిస్తోందని, ఇప్పుడు ఐఐటి హైదరాబాద్ కూడా భాగస్వామ్యం కావడం ఎంతో సంతోషకరమని ఆయన తెలిపారు.

ఇప్పుడు ఐఐటి హైదరాబాద్, ట్రైబల్ యూనివర్సిటీ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం చాలా ప్రాముఖ్యత కలిగినదన్నారు. ప్రధాని దూర దృష్టితో ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన తెలిపారు. నాణ్యమైన విద్య కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గించడమే ఈ ప్రయత్నం వెనుక ఉద్దేశ్యం అని ఆయన స్పష్టం చేశారు. గిరిజన సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని ఆయన పేర్కొన్నారు. గిరిజన స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా జయంతిని ‘జాతీయ గిరిజన గౌరవ దినోత్సవం’గా నిర్వహిస్తోందని కిషన్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్‌లో రాంజీ గోండు, కొమరం భీమ్ వంటి గిరిజన వీరుల స్మారకంగా ట్రైబల్ మ్యూజియం నిర్మాణం చేపట్టామని భూమి పూజ పూర్తయిందని ఆయన వివరించారు. ఈ సంవత్సరం చివరికి మ్యూజియాన్ని ప్రారంభించే లక్ష్యంతో పనులు వేగంగా కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. ‘ప్రధానమంత్రి జన్ మన్ యోజన’ వంటి పథకాల ద్వారా గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందన్నారు. గిరిజనుల విద్యా, సామాజిక, ఆర్థిక అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి పని చేస్తున్నదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.