Reading Time: < 1 minute
Us Iran Talks Islamabad Ceasefire Negotiations Trump Warning

ఇస్లామాబాద్ వేదికగా ఇవాళ ఇరాన్-అమెరికా మధ్య కీలక సమావేశం జరగబోతుంది. కాల్పుల విరమణ ఒప్పందంపై రెండు దేశాల మధ్య చర్చలు జరగనున్నాయి. ఈ చర్చలకు పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహిస్తోంది. ఈ చర్చలకు ఇరాన్ వస్తుందా? రాదా? అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మొత్తానికి అర్థరాత్రి సమయంలో ఇరాన్ బృందం ఇస్లామాబాద్ చేరుకుంది. నూర్‌ఖాన్ ఎయిర్‌పోర్టులో ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ స్వాగతం పలికారు. అయితే ఇరాన్ విమానంలో ఇటీవల అమెరికా దాడుల్లో చనిపోయిన 170 మంది పాఠశాల విద్యార్థుల ఫొటోలు ఖాళీ సీట్లలో పెట్టి నివాళులర్పించిన దృశ్యాలు కనిపించాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియో వైరల్ అవుతున్నాయి.

ఇక ఇరాన్ బృందానికి స్పీకర్ మహ్మద్ బఘేర్ ఘాలిబాఫ్ నాయకత్వం వహిస్తుండగా.. అమెరికాకు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నాయకత్వం వహిస్తున్నారు. అయితే చర్చలపై సర్వత్రా టెన్షన్ నెలకొంది. చర్చల సాఫీగా సాగుతాయా? లేదంటే సందిగ్ధం నెలకొంటుందా? అన్నది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇరు పక్షాలు కీలక డిమాండ్లు తీసుకొస్తున్నాయి. వీటిపై పీఠముడి వీడుతుందా? లేదన్నది తేలాల్సి ఉంది.

ట్రంప్ వార్నింగ్..
ఇదిలా ఉంటే చర్చలకు ముందు ట్రంప్ ఇరాన్‌కు తీవ్ర వార్నింగ్ ఇచ్చారు. చర్చలు విఫలమైతే భీకర దాడులు ఉంటాయని.. ఇరాన్ చుట్టూ అమెరికా నౌకలు శక్తివంతమైన ఆయుధాలతో సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించారు. ఒప్పందమా? దాడులా? అన్నది 24 గంటల్లో తేలిపోతుందని ట్రంప్ పేర్కొన్నారు.