
హైదరాబాద్: మాజీ సిఎం కెసిఆర్ వల్లే తెలంగాణ వచ్చిందనడం హాస్యాస్పదమని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వడం వల్లే కెసిఆర్ సిఎం అయ్యారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను మాట్లాడిన విషయాలపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. పాలమూరు ప్రాజెక్టులపై రాజకీయం చేస్తున్నది బిఆర్ఎస్ అని పాలమూరు కోసం బిఆర్ఎస్ ఖర్చు పెట్టింది రూ. 7 వేల కోట్లు మాత్రమేనని, ప్రాజెక్టుల పేరుతో కెసిఆర్ ఆంధ్రా కాంట్రాక్టర్లకు దోచి పెట్టారని జూపల్లి విమర్శించారు. నీళ్లు ఉన్న చోట లిఫ్ట్ ద్వారా నీళ్లు పట్టుకుపోతున్నారని, నీళ్లు లేని చోట మాత్రం పదేళ్లలో అనేక ప్రాజెక్టులు కట్టారని మండిపడ్డారు. ఆలోచన, అవగాహన లేక రాష్ట్రానికి తీవ్ర నష్టం చేశారని, పాలమూరు ప్రాజెక్టును 80 శాతం పూర్తి చేశామని అబద్ధాలు చెబుతున్నారని, కెసిఆర్ బాధ్యతారాహిత్య పాలన చేశారని జూపల్లి కృష్ణారావు ధ్వజమెత్తారు.