
భారతీయ సంస్కృతిలో బంగారం కేవలం ఒక లోహం మాత్రమే కాదు. అది లక్ష్మీదేవి స్వరూపంగా హిందువులు భావిస్తారు. ఏటా అక్షయ తృతీయ వచ్చిందంటే చాలు నగల దుకాణాలు కిటకిటలాడుతుంటాయి. ఈ ఏడాది ఏప్రిల్ 20న రాబోతున్న అక్షయ తృతీయ కోసం అప్పుడే సన్నాహాలు మొదలయ్యాయి. అసలు ఈ రోజున బంగారం ఎందుకు కొనాలి? దీని వెనుక ఉన్న ఆర్థిక, ఆధ్యాత్మిక రహస్యాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
లక్ష్మీదేవి ఇంట్లోకి..
“వైశాఖ మాస శుక్లపక్షంలో వచ్చే తదియను ‘అక్షయ తృతీయ’ అంటారు. మహాభారతంలో ధర్మరాజు సూర్యరాధన చేసి అక్షయ పాత్రను పొందిన రోజు ఇదేననీ.. అందువల్ల అక్షయ తృతీయగా పేరొచ్చిందనేది కొందరి విశ్వాసం. అలాగే పరమ పవిత్రమైన గంగానది దివి నుంచి భువికి దిగివచ్చిన రోజు కూడా ఇదేనని కొందరి భావన. అంతేకాదు.. శ్రీకృష్ణ పరమాత్ముడిని దర్శించి కుచేలుడు అనంతమైన సంపదలు పొందినదీ ఈరోజునే అంటారు. ఒక ఉసిరి కాయను భిక్షగా వేసిన పేదరాలి దయా గుణాన్ని గుర్తించి జగద్గురువులైన ఆదిశంకరులు అమ్మవారిని ప్రార్థించి ఆమె ఇంట బంగారు ఉసిరికాయల వాన కురిపించింది కూడా వైశాఖ శుద్ధ తదియ నాడేనని చెబుతారు. ఇలా అక్షయ తృతీయకు అనేక రకాలుగా ప్రాధాన్యం ఉంది. అందుకే ఈరోజు బంగారం కొంటే ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందని నేను గట్టిగా నమ్ముతాను” అంటోంది శ్రీశాంతి. ఈమె నమ్మకం ఇలా ఉంటే…బంగారం కొనడానికి మంచి, చెడు లేంటి? అనేవాళ్లు లేకపోలేదు.
తరుగు లేని సంపద..
‘అక్షయ’ అంటేనే తరుగు లేనిది అని అర్థం. ఈ పవిత్రమైన రోజున ఏ పని మొదలుపెట్టినా.. ఏ వస్తువు కొన్నా అది అక్షయమై, జీవితాంతం వృద్ధి చెందుతుందని భారతీయుల ప్రగాఢ విశ్వాసం. అందుకే తరతరాలుగా పెరిగే ఆస్తిగా భావించే బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ప్రజలు ప్రాధాన్యత ఇస్తారు. ఈ నమ్మకమే ప్రతి ఇంటా బంగారు కాంతులను నింపుతోంది.
లక్ష్మీ కటాక్షం.. ఆర్థిక భరోసా
హిందూ సంప్రదాయం ప్రకారం.. బంగారం ఐశ్వర్యానికి దేవత అయిన మహాలక్ష్మికి చిహ్నం. అక్షయ తృతీయ నాడు బంగారం కొనడం అంటే సాక్షాత్తూ ఆ లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించడమేనని నమ్ముతారు. కేవలం ఆధ్యాత్మిక భావన మాత్రమే కాకుండా.. ఆర్థికంగా కూడా ఇది ఒక తెలివైన నిర్ణయం. ఆపద కాలంలో ఆదుకునే ఆపద్బాంధవుడిగా, దీర్ఘకాలిక పెట్టుబడిగా బంగారం భారతీయుల జీవితాల్లో కీలక పాత్ర పోషిస్తోంది.
అబూజ్ ముహూర్తం.. ఎప్పుడైనా శుభమే!
సాధారణంగా ఏదైనా శుభకార్యం చేయాలంటే తిథి, నక్షత్రం, వర్జ్యం వంటివి చూస్తుంటాం. కానీ అక్షయ తృతీయకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే.. ఇది ఒక అబూజ్ ముహూర్తం. అంటే ఈ రోజంతా శుభ సమయమే. ఏ సమయంలోనైనా పూజలు చేసుకోవచ్చు. కొత్త వ్యాపారాలు మొదలుపెట్టవచ్చు. బంగారు ఆభరణాలు కొనుగోలు చేయవచ్చు. ఈ వెసులుబాటు వల్లే సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అందరూ ఈ పండుగలో ఉత్సాహంగా పాల్గొంటారు.
గుడ్డిగా కొంటే..
అక్షయ తృతీయకు బంగారం కొంటే మంచి జరుగుతుందని గుడ్డిగా కొంటే మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది. ఆఫర్ల హడావుడిలో నగలు కొనే ముందు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. కూరగాయలో, మరేదైనా వస్తువో అయితే వందల్లో నష్టం ఉంటుంది. కానీ బంగారం కొనే ముందు ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా నష్టం వేలల్లో, లక్షల్లో ఉంటుంది. చాలామంది పసుపురంగు అధికంగా వచ్చేలా రసాయనాలను వాడతారు. బంగారం శాతం తక్కువగా ఉన్నా..22 క్యారెట్లు ఉందని చెప్పి డబ్బు వసూలు చేస్తుంటారు. అక్షయ తృతీయ రోజు ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. ఆఫర్ల హడావుడిలో పడి చాలామంది గుడ్డిగా మోసపోతారు. అందుకే బంగారం కొనేముందు జాగ్రత్త వహించాలి.
ఒకప్పుడు కేవలం నగలు మాత్రమే కొనేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఈ అక్షయ తృతీయకు ఫిజికల్ గోల్డ్‌తో పాటు డిజిటల్ గోల్డ్, గోల్డ్ కాయిన్స్, గోల్డ్ ఈటీఎఫ్‌ల వైపు యువత మొగ్గు చూపుతోంది. జువెలర్స్ కూడా సరికొత్త డిజైన్లతో పాటు ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటిస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు. మొత్తానికి అక్షయ తృతీయ కోసం అటు బంగారు వ్యాపారులు, ఇటు ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.