Reading Time: < 1 minute
Hyderabad: దొంగ ఇంట్లో సోదాలు చేస్తుండగా చెత్త కుప్పలో కనిపించినవి చూసి కళ్లు జిగేల్..

హైదరాబాద్‌లో చోరీ కేసులో దొంగ తెలివిగా వేసిన ప్లాన్ చివరికి పోలీసుల ముందు బట్టబయలైంది. జూబ్లీహిల్స్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో దొంగ దొంగిలించిన సొత్తును చెత్తలో దాచిపెట్టి తప్పించుకోవాలని చూసినా.. పోలీసుల దర్యాప్తు ముందు అతని యత్నం ఫలించలేదు. బిహార్‌కు చెందిన గ్యాంగ్ సభ్యుడు ఆనంద్ ముఖియా అనే వ్యక్తిని జూబ్లీహిల్స్ క్రైమ్ టీం ఇటీవల అరెస్ట్ చేసింది. పదిరోజుల పాటు పోలీసులు అతడిని ప్రశ్నించినా మొదట్లో తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశాడు. ఎలాంటి సమాచారం బయటకు పొక్కకుండా మాయమాటలు చెప్పాడు. అయితే, అనుమానంతో అతని ఇంటిని సోదా చేసిన పోలీసులు చెత్తలో దాచిపెట్టిన డైమండ్ రింగ్స్ గుర్తించారు. ఈ ఒక్క ఆధారమే కేసులో కీలక మలుపుగా మారింది. దీంతో అతడి దొంగతనం వ్యవహారం మొత్తం వెలుగులోకి వచ్చింది. ఆనంద్ ముఖియా వద్ద నుంచి సుమారు రూ.14 లక్షల విలువైన చోరీ సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

విచారణలో భాగంగా ఆనంద్ ముఖియా గతంలో కూడా ఇలాంటి చోరీ కేసుల్లో పాలుపంచుకున్నాడా..? అతడు పనిచేసిన గ్యాంగ్‌లో మరెవరు ఉన్నారు..? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నగరంలో ఇటీవల నమోదైన ఇతర చోరీ కేసులతో సంబంధం ఉందా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. బయట రాష్ట్రాల నుంచి వచ్చి నగరంలో స్థిరపడే గ్యాంగులు ముందుగా రెక్కీ నిర్వహించి, ఖరీదైన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నట్టు పోలీసుల అనుమానం. ముఖ్యంగా ఆభరణాలు, నగదు లక్ష్యంగా చేసుకుని వేగంగా దొంగతనాలు చేసి తప్పించుకోవడం వీరి పద్ధతిగా గుర్తించారు. ఈ కేసులో లభించిన ఆధారాల ఆధారంగా మరికొన్ని చోరీ కేసులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న ఆభరణాలు మరిన్ని కేసులకు సంబంధించినవా అన్న అంశంపై కూడా విచారణ కొనసాగుతోంది.

Also Read: మురుగు కాలువ కింద నుంచి చప్పుళ్లు.. ఏంటా అని చూడగా.. చుట్టలు చుట్టలుగా..