
- తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపణ
- నామినేషన్ల పద్ధతిలో రూ.1148 కోట్ల కాంట్రాక్టులు
- బీఆర్ఎస్ హయాం నుంచే ఈ నామినేషన్ల పద్ధతి
- కమీషన్ల కోసమే కాళేశ్వరం రిపేర్లంటున్నరు
- ఎంపీ అర్వింద్‌కు తెలివిలేదు
- తనపై అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకోనని వార్నింగ్
హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతున్నదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం అంటూ హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న రూ.35 వేల కోట్ల విలువైన ప్లాట్లను అమ్మేశారని, ఆ డబ్బులు హైదరాబాద్ నగర అభివృద్ధికి ఏ మాత్రం ఉపయోగపడలేదన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని జాగృతి ఆఫీసులో కవిత మీడియాతో మాట్లాడారు. గ్రామాల్లో ఏదైనా పని చేయాలంటేరూ.5 లక్షలు దాటిన వర్క్స్‌కు టెండర్‌ను పిలుస్తారని, కానీ, హెచ్ఎండీఏ పరిధిలో మాత్రం నామినేషన్ రూపంలో కట్టబెట్టేస్తున్నారని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచే ఈ పద్ధతి కొనసాగుతున్నదని తెలిపారు.
2017 నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విధంగా రూ.480 కోట్లు కాంట్రాక్టర్లకు ఇచ్చిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.1,148 కోట్ల విలువైన పనులను నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టర్లకు అప్పగించిందని ఆరోపించారు. నామినేషన్ల పద్ధతిలో కాంట్రాక్ట్ లు ఇవ్వవద్దని 2023లోనే వేసిన కమిటీ స్పష్టం చేసిందని గుర్తు చేశారు. ఓఆర్ఆర్ మెయింటెనెన్స్ఖర్చు మొత్తం ప్రభుత్వమే పెడుతున్నదని ఆరోపించారు. అవినీతిని ఇంకా పెంచుకోవటానికి ఫ్యూచర్ సిటీని ముందుకు పెడుతున్నారని ఆరోపించారు.
కమీషన్ల కోసమే కాళేశ్వరం రిపేర్లు..
కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టుకు రిపేర్లంటున్నారని కవిత విమర్శించారు. కాళేశ్వరం ఫెయిల్ అయ్యిందని చెప్పేందుకు ఎనిమిదిన్నర లక్షల ఎకరాలను ఎండబెట్టిన కర్కోటక ప్రభుత్వమని మండిపడ్డారు. ఎంపీ అర్వింద్ కు తెలివిలేదని, ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదన్నారు. తన లాంటి వాళ్లను ఎవరో మద్దతిస్తే బతుకుతానని అర్వింద్ చెప్పడం పురుషాహంకారానికి నిదర్శనమన్నారు.
మరోసారి అలా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. జాగృతి పార్టీ ఏర్పాటు కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు 21 కమిటీలు వేశామన్నారు. ప్రతి కమిటీలో 30 మంది సభ్యులు, 500 మంది వలంటీర్లు ఉంటారని తెలిపారు.