Reading Time: 2 minutes
పిల్లలకు ఇస్తున్న క్రీమ్ బిస్కెట్లలో అసలు క్రీమ్ ఉందా?

ఉదయం నిద్ర లేవగానే టీలో ఓ బిస్కెట్ ముంచుకుని తినడం.. పిల్లలు అడగగానే క్రీమ్ బిస్కెట్లు కొనివ్వడం మనలో చాలా మందికి అలవాటు. అయితే మనం కొనే ఆ క్రీమ్ బిస్కెట్లలో నిజంగా పాలతో చేసిన క్రీమ్ ఉందా? లేక మోసపోతున్నామా? ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన చేదు నిజం. ప్యాకెట్ల మీద కనిపించే చిన్న స్పెల్లింగ్ మార్పు వెనుక ఫుడ్ ఇండస్ట్రీ ఆడుతున్న పెద్ద గేమ్‌ ఇప్పుడు బయటపడింది.

మనం సాధారణంగా క్రీమ్ అనగానే.. పాలపై తేలే స్వచ్ఛమైన మీగడ లేదా పాలతో చేసిన పదార్థం అని భావిస్తాం. ఫుడ్ నిబంధనల ప్రకారం కూడా క్రీమ్ (Cream) అంటే పాలతో ఏర్పడే నిజమైన మిల్క్ ఫ్యాట్ అని అర్థం. ఫ్రెష్ క్రీమ్, విప్డ్ క్రీమ్, డెయిరీ క్రీమ్.. ఇవన్నీ పాలతోనే తయారవుతాయి. ఇవి సహజ సిద్ధమైన డెయిరీ ఉత్పత్తులు.

కానీ మార్కెట్లో లభిస్తున్న ప్యాకేజ్డ్ బిస్కెట్లు, వాఫర్స్, కేకుల్లో మనం చూసేది ఇది కాదు. చాలా ప్యాకెట్లను జాగ్రత్తగా గమనిస్తే.. వాటిపై ‘Cream’ కు బదులుగా ‘Crème’ అని రాసి ఉంటుంది. ఇక్కడే అసలు మోసం దాగి ఉంది. ఈ చిన్న స్పెల్లింగ్ మార్పుతో కంపెనీలు వినియోగదారుల కళ్లుగప్పుతున్నాయి. ఆకర్షణీయమైన ప్యాకింగ్ చూసి జనం నిజమైన క్రీమ్ బిస్కెట్లు అని భ్రమపడుతున్నారు. ఇంతకీ ఈ ‘Crème’ అంటే ఏంటో తెలిస్తే మీరు ముక్కున వేలేసుకుంటారు. ఇందులో పాలతో చేసిన క్రీమ్ అణువంత కూడా ఉండదు. ఇది పూర్తిగా పామాయిల్, వెజిటబుల్ ఆయిల్, విపరీతమైన చక్కెర, ఎమల్సిఫైయర్లు, కృత్రిమ రంగులు, ఫ్లేవర్లు కలిపి చేసే ఓ మిశ్రమం మాత్రమే. రుచికి, చూడటానికి క్రీమ్‌లాగే అనిపించినా.. ఇందులో డెయిరీ కంటెంట్ సున్నా అని నిపుణులు వివరిస్తున్నారు. అయితే కంపెనీలు ఎందుకు ఇలా చేస్తున్నాయి? నిజానికి పాలతో చేసిన క్రీమ్ వాడకపోతే.. ప్యాకెట్‌పై స్పష్టంగా ‘Cream’ అని రాయకూడదు. అలా రాస్తే ఫుడ్ సేఫ్టీ నిబంధనల ఉల్లంఘన అవుతుంది. అందుకే దొడ్డిదారిన ఫ్యాన్సీ లుక్ కోసం ‘Crème’ అనే పదాన్ని వాడుతూ క్రీమీ ఫీలింగ్ తీసుకొస్తున్నారు.

నిత్యం ఇలాంటి నకిలీ క్రీమ్ బిస్కెట్లను పిల్లలకు తినిపించడం వల్ల ఊబకాయం తదితర అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. పామాయిల్, వెజిటబుల్ ఫ్యాట్స్ ఎక్కువగా శరీరంలోకి వెళ్లడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని వైద్యులు సైతం వార్నింగ్ ఇస్తున్నారు. అందుకే వినియోగదారులు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. మరి అసలు నిజం ఎలా తెలుసుకోవాలి? దీనికో సులువైన మార్గం ఉంది. ప్యాకెట్ ముందు వైపు ఉన్న పేరును చూసి ఎప్పుడూ మోసపోవద్దు. బిస్కెట్ లేదా కేక్ ప్యాకెట్ కొనేటప్పుడు దాన్ని వెనక్కి తిప్పి ఇంగ్రీడియంట్స్ (Ingredients) లిస్ట్‌ను తప్పకుండా చదవాలి. అందులో మొదటగా పామాయిల్, వెజిటబుల్ ఫ్యాట్, షుగర్ అని ఉంటే.. అది నిజమైన పాల క్రీమ్ కాదని, కేవలం ఇమిటేషన్ ఫీలింగ్ అని గుర్తించాలి. ఇకపై షాపింగ్‌కు వెళ్లినప్పుడు ఒకటే గుర్తుంచుకోండి. ‘Cream’ అని రాసి ఉంటే అది పాలతో చేసిన నిజమైన క్రీమ్.. ‘Crème’ అని ఉంటే అది నూనెలతో చేసిన ఫీలింగ్ అని గ్రహించండి. పేరు చూసి మోసపోకుండా.. ఇంగ్రీడియంట్స్ చదవడం అలవాటు చేసుకోండి. స్మార్ట్ కస్టమర్‌గా మారి మీ కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.