
కడప జిల్లాలో దారుణం జరిగింది. ఇంటర్ విద్యార్థినిని గొంతు కోసి చంపేశాడు ఓ యువకుడు. కడప జిల్లా ఖాజీపేటలో జరిగింది ఈ ఘటన. శుక్రవారం ( ఏప్రిల్ 10 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. ఖాజీపేటకు చెందిన కీర్తన ఇంటర్ చదువుతోంది. ఎగ్జామ్స్ పూర్తవ్వడంతో ఇంటి దగ్గరే ఉంటోంది కీర్తన. ఇంట్లో ఎవరు లేని సమయంలో వచ్చి కీర్తన గొంతు కోసి కిరాతకంగా చంపేశాడు వెంకటేష్.
ఇవాళ ఉదయం వ్యాపారానికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చేసరికి కీర్తన గొంతు కోయబడి.. రక్తపు మడుగులో పడి ఉందని చెబుతున్నారు కీర్తన తల్లిదండ్రులు. తమకు కీర్తన ఒక్కగానొక్క బిడ్డ అని… అమాయకురాలైన తమ బిడ్డను దారుణంగా చంపేశాడని వాపోతున్నారు తల్లిదండ్రులు.
►ALSO READ | ప్రాణాలు తీసిన సెల్ఫీ సరదా… జలపాతంలో పడి ముగ్గురు విద్యార్థినులు మృతి
నిందితుడు వెంకటేష్ ఆరు నెలల క్రితమే కీర్తన సోషల్ మీడియాలో ఫోటోలు పెడుతోంది.. అదుపులో పెట్టుకోండంటూ తమకు ఫిర్యాదు చేశాడని.. కీర్తన దగ్గర ఫోన్ కూడా లేదని.. ఎలా చూసుకోవాలో మాకు తెలుసని చెప్పి పంపించామని అంటున్నారు తల్లిదండ్రులు. అప్పటి నుంచి కీర్తనపై కన్నేసి చంపేశాడని అంటున్నారు తల్లిదండ్రులు.
వెంకటేష్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఒక్కగానొక్క బిడ్డ మృతి చెందడంతో కన్నీరు మున్నీరవుతున్నారు కీర్తన తల్లిదండ్రులు.