
హర్మూజ్ జలసంధిపై ప్రయాణిస్తున్న అత్యంత విలువైన అమెరికా నిఘా డ్రోన్ అకస్మాత్తుగా అదృశ్యం కావడం కలకలానికి దారి తీసింది. అత్యంత ఖరీదైనదిగా పేరున్న ఎంక్యూ-4సి ట్రైటన్ శుక్రవారంనాడు హర్మూజ్ గగనతలంలో కనిపించకుండా పోయింది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అమెరికా-ఇరాన్ చర్చల వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం కలకలం రేపింది. పర్షియన్ గల్ఫ్, హోర్ముజ్ జలాలపై నిఘా కోసం బయలుదేరిన డ్రోన్ దాదాపు మూడు గంటల తరువాత కనిపించకుండా పోయింది. ఫ్లైట్ రాడార్24 డేటా ప్రకారం,
ఈ డ్రోన్ మిషన్ తిరిగొస్తూ ఇరాన్ వైపు మళ్లింది. ఆ తరువాత కాసేపటికే ఎమర్జెన్సీ ప్రకటించింది. ఈ క్రమంలో కిందకు దిగిన డ్రోన్ రాడార్ స్క్రీన్‌లపై కనుమరుగైంది. డ్రోన్‌ను ఎవరైనా కూల్చేశారా? లేక మరేదైనా సాంకేతిక లోపం తలెత్తిందా? అన్న విషయాలపై ఇంకా స్పష్టత రాలేదు. దాదాపు 200 మిలియన్ డాలర్ల విలువైన ఈ డ్రోన్‌ను యూఎస్ సెంట్రల్ కమాండ్ పరిధిలోని గల్ఫ్ ప్రాంతంలో మోహరించారు. సముద్రజల్లాల్లో కీలక ప్రాంతాలపై ఎక్కువ సమయం పాటు నిఘా పెట్టేందుకు అమెరికా ఈ డ్రోన్‌ను వినియోగిస్తోంది.