Reading Time: < 1 minute

విధుల్లో చేరకపోతే తీసేస్తాం..ఆర్టిజన్ కార్మికులకు జెన్కో సీఎండీ వార్నింగ్

Caption of Image.
  • పాల్వంచ కేటీపీఎస్ లో కొనసాగుతున్న ఆందోళన 

పాల్వంచ, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులు గురువారం రాత్రి వరకు విధుల్లో చేరకపోతే శుక్రవారం వారిని విధుల నుంచి తొలగించాలని జెన్కో సీఎండీ హరీశ్​ ఆదేశించారు. ఈ మేరకు గురువారం విద్యుత్ సంస్థల చీఫ్ ఇంజనీర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తమ మాట వినకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్(కేటీపీఎస్) 5, 6, 7 దశల్లో గురువారం ఆర్టిజన్ కార్మికులు భారీగా గైర్హాజరయ్యారు. దీంతో బయట నుంచి కార్మికులను రప్పించి విధులు నిర్వహిస్తున్నారు. స్థానిక కేటీపీఎస్ ఆస్పత్రి ఎదుట ఏర్పాటు చేసిన శిబిరంలో కొనసాగుతున్న నిరసన కార్యక్రమానికి సీపీఐ పాల్వంచ పట్టణ మండల కార్యదర్శి అడుసుమల్లి సాయిబాబా, వీసంశెట్టి పూర్ణచంద్రరావు సహా పలు పార్టీల నాయకులు, కార్మిక సంఘాల ప్రతినిధులు సంఘీభావం తెలిపారు. 

ఈ విషయంపై కేటీపీఎస్ చీఫ్ ఇంజినీర్ ప్రభాకర్‌‌రావును వివరణ కోరగా, సాయంత్రం తర్వాత విధుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతున్నట్లు కనిపిస్తోందని చెప్పారు. హెచ్–84 రాష్ట్ర నాయకుడు సాయిలు మాట్లాడుతూ జెన్కో, ట్రాన్స్​కో యాజమాన్యాలు కార్మికులను భయపెట్టి విధుల్లోకి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. కార్మికులంతా సంఘటితంగా ఉన్నారని పేర్కొన్నారు.

©️ VIL Media Pvt Ltd.