Reading Time: 2 minutes
4,4,4,4,6,4,4,4,6,6,6.. 15 బంతుల్లో వైభవ్ తుఫాన్ హాఫ్ సెంచరీ.. ఆర్సీబీ బౌలర్లను చెడుగుడు ఆడేసిన బుడ్డోడు

ఐపీఎల్ 2026 సీజన్ 16వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడ్డాయి. ఈ పోరులో మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోరు సాధించింది. 202 పరుగుల కఠినమైన లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్కోరు 21 పరుగుల వద్ద ఉండగా స్టార్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ వికెట్ కోల్పోయింది. అయితే, ఆ తర్వాత ఎడమచేతి వాటం బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు.

దిగ్గజ బౌలర్లపై వైభవ్ విరుచుకుపాటు..

ఎదురుగా ఉన్నది ఎంతటి దిగ్గజ బౌలర్ అని కూడా చూడకుండా వైభవ్ పరుగుల వరద పారించాడు. పవర్ ప్లే సమయంలో బెంగళూరు ప్రధాన బౌలర్లయిన భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్ బౌలింగ్‌ను చీల్చి చెండాడాడు. కేవలం 15 బంతుల్లోనే 7 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 53 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతని స్ట్రైక్ రేట్ 353.33గా నమోదు కావడం విశేషం. కేవలం 15 ఏళ్ల ప్రాయంలోనే ఇంతటి పరిణతితో కూడిన ఇన్నింగ్స్ ఆడటం చూసి స్టేడియంలోని ప్రేక్షకులు, విశ్లేషకులు ఆశ్చర్యపోయారు.

వరుస బౌండరీలతో రికార్డుల వేట..

వైభవ్ ఇన్నింగ్స్ సాగిన తీరు అద్భుతంగా ఉంది. మొదటి ఓవర్లోనే భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో రెండు ఫోర్లు బాది తన ఉద్దేశాన్ని చాటుకున్నాడు. మూడవ ఓవర్లో అభినందన్ సింగ్ బౌలింగ్‌లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్ బాదగా, నాలుగో ఓవర్లో హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో వరుసగా మూడు ఫోర్లు, ఒక సిక్సర్ సాధించాడు. ఐదో ఓవర్లో తిరిగి వచ్చిన భువనేశ్వర్ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు, రెండు ఫోర్లు బాది స్టేడియాన్ని హోరెత్తించాడు.

చరిత్రలో నిలిచిన వేగవంతమైన అర్ధశతకాలు..

ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన అర్ధశతకం రికార్డు యశస్వి జైస్వాల్ (13 బంతులు) పేరిట ఉంది. ఆ తర్వాత కేఎల్ రాహుల్ (14 బంతులు) రెండో స్థానంలో ఉన్నాడు. వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు 15 బంతుల్లో అర్ధశతకం సాధించి యూసుఫ్ పఠాన్ సరసన చేరాడు. ప్రస్తుత సీజన్లో వైభవ్ ఇలా 15 బంతుల్లోనే అర్థసెంచరీ చేయడం ఇది రెండోసారి కావడం విశేషం. ఇంతకుముందు చెన్నై జట్టుపై కూడా అతను ఇదే తరహాలో విరుచుకుపడ్డాడు. రాజస్థాన్ రాయల్స్ భవిష్యత్తు తారగా వైభవ్ తన ముద్ర వేస్తున్నాడు.