
దేశంలో దళారీ వ్యవస్థ బలంగా విస్తరించడం వల్ల ప్రభుత్వ ఆఫీసులోకి ప్రజలు వెళ్లి స్వయంగా పనులు చక్కబెట్టుకొనే పరిస్థితి లేకుండా పోయింది. ఆధునిక సాంకేతికతని ఉపయోగించి దళారీ లంకెని తెగ్గొట్టాలని ప్రభుత్వాలు చేస్తున్న ప్రయోగాలు అనుకున్న ఫలితం ఇవ్వడం లేదు. ఆన్‌లైన్ లో స్లాట్ బుక్ చేసుకున్నా దళారీ దగ్గరకు పోనిదే ఆఫీసులోకి ఫైల్ కదలడం లేదు. దళారిని వద్దను కుంటే ఆఫీసు చుట్టూ పదిసార్లు చక్కర్లుకొట్టాలి. అప్పటికీ పని అవుతుందన్న గ్యారెంటీ లేదు. రాను పోను సమయం, ఖర్చు వృథా ఎందుకని చాలా మంది బ్రోకర్‌ను ఆశ్రయిస్తుంటారు. ఇది తప్పా ఒప్పా అనే డెబిట్ అనవసరం. అవినీతిని అంతం చేయాలనే చిత్తశుద్ధి ప్రభుత్వాలకు లేనంత కాలం ఎన్ని మార్పులు చేపట్టినా దండగే.స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ ఆఫీసులో వ్యవహారమంతా డాక్యుమెంట్ రైటర్ల చేతుల మీదుగానే జరుగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హయాంలో డాక్యుమెంట్ రైటర్ల వ్యవస్థ 1972లో రూపుదిద్దుకొంది. అప్పటి వరకు ఉన్న దస్తావేజు రాతగాళ్ల అర్హతలను బట్టి వారిలో కొందరిని ఎంపిక చేసి డాక్యుమెంట్ రైటర్ లైసెన్సులు జారీ చేశారు.
అప్పటి నుంచి నిర్విరామంగా కొనసాగుతున్న డాక్యుమెంట్ రైటర్ వ్యవస్థ 1992లో రద్దయింది. అయినప్పటికీ డాక్యుమెంట్ రైటర్లు కనుమరుగు కాలేదు. లైసెన్సులు లేకపోయినా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు రూ. 200 ఫీజు చెల్లించి అనుమతి తీసుకోవడం ద్వారా డాక్యుమెంట్లను తయారుచేసేవారు. ఇలా కొంతకాలం కొనసాగగా 2002లో అప్పటి ప్రభుత్వం ఆ పద్ధతిని కూడా రద్దు చేసి డాక్యుమెంట్ తయారీలో ఉన్న నిబంధనలన్నీ తొలగించింది. అంటే ఎవరికి వారు డాక్యుమెంట్ తీసుకొని వచ్చినా అది ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉంటే రిజిస్ట్రార్ ఒప్పుకోవలసిందే. కానీ మధ్య దళారీగా పనిచేస్తున్న డాక్యుమెంట్ రైటర్ ముందుండి కదిలిస్తే తప్ప రిజిస్ట్రేషన్ పూర్తవని దుస్థితి కొనసాగుతోంది.
సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులపై ఎసిబి దాడులు షరా మామూలే. ఇటీవల హనుమకొండ ఎస్‌ఆర్‌ఒపై జరిగిన ఆకస్మిక తనిఖీలో 20 మంది బ్రోకర్లు దొరికారు. వారి వద్ద లెక్క చూపలేని సొమ్ము దొరికింది. అధికారి సొరుగులో లంచం అందక అప్పగించని దస్తావేజులు దొరికాయి. అధికారి, లేఖరుల ఫోన్ల సంభాషణలో వసూళ్ల ముచ్చట్లు దొరికాయి. ఆన్‌లైన్ మనీ ట్రాన్స్‌ఫర్ ద్వారా అధికారికి రూ. 42 లక్షలు బదిలీ చేసినట్లు ఆధారాలు లభించాయి. నిత్యకృత్యమైన ఈ వ్యవహారం ఒక్క ఎస్‌ఆర్‌ఒ బాగోతం కాదు. అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో జరిగే తంతే. పట్టుబడినా ఆగని దందా ఇది. లక్షలు పెట్టి కొనే భూమి, ఇల్లు కాగితాలు సక్రమంగా ఉండాలనే ముందు జాగ్రత్తతో కొనుగోలుదారులు అడిగినంత సొమ్ము ముట్టజెప్పడానికి సిద్ధపడతారు. అదే వారి సంపాదనకు ఆయువుపట్టు. మీ సేవ సెంటర్లు వివిధ ఆఫీసుల్లో అవసరమయ్యే సర్టిఫికెట్లను ఒకే చోట అందించే సౌలభ్య కేంద్రాలు. తహసీల్దార్ కార్యాలయం నుండి ఏ ధ్రువీకరణ పత్రం కావాలన్నా మీ సేవ ద్వారానే అప్లికేషన్ పంపాలి.
ఉదాహరణకు ఒకరి డెత్ సర్టిఫికెట్ కావాలంటే మీ సేవలో సంప్రదిస్తే తగిన రుజు పత్రాలను జోడించి అభ్యర్థనను రెవెన్యూ కార్యాలయానికి పంపుతారు. ప్రతి సర్టిఫికెట్ పొందడానికి నిర్ణీత సమయం తెలిపే పట్టిక అక్కడ ఉంటుంది. అయితే మీ సేవలో అప్లయి చేయగానే సమయం ప్రకారం సర్టిఫికెట్ చేతికందదు. సమయం మించిపోయిం ది కదా అని మీ సేవలో ఆరా తీస్తే ఆఫీసుకు వెళ్లి కలవమని చెబుతారు. ఆఫీసుకు వెళ్లి అడిగితే అప్పుడే ఫైల్ కదులుతుంది. వారం రోజుల్లో విచారణకు వస్తామంటారు. అలా వచ్చిన వ్యక్తి బేరసారాలు మొదలెడతాడు. మీరు ఇంత మొత్తాన్ని చెల్లిస్తే రేపు సర్టిఫికెట్ తెచ్చి ఇస్తాను. లేదంటే దొరకదు అని చెప్పేస్తాడు. రాజీపడవలసిందే. ఆ డెత్ సర్టిఫికెట్ లేకుంటే ఎన్నో పనులు ఆగిపోతాయి. మీ సేవ సెంటర్ ఒక పోస్ట్ బాక్స్ మాత్రమే. మిగతాదంతా ఆఫీసుకి వెళితేనే సాధ్యపడుతుంది. కంపెనీ అధీకృత డీలర్ల దగ్గరే మోటార్ సైకిల్, కారు లాంటి వ్యక్తిగత వాహనాల రిజిస్ట్రేషన్ పూర్తయే పద్ధతిని ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
దీని వల్ల ఇక ఆర్‌టిఎ ఆఫీసు చుట్టూ తిరిగే బెడద తప్పుతుందని వాహనదారులు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. వెహికిల్‌ని తీసుకుని ఆఫీసు వద్దకు వెళ్లే పని తప్పుతుంది. హైదరాబాద్‌లో అయితే కొందరు ఎంతో దూరం వెళ్ళవలసి వస్తోంది. 24, జనవరి నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీలర్ పాయింట్ రిజిస్ట్రేషన్ కు పచ్చజెండా ఊపారు. అయితే ఆర్‌టిఎ ఆఫీసు చేసే దోపిడీ దందా డీలర్ల చేతుల మీదుగా మొదలైందని పత్రికల్లో వచ్చింది. వాహన రిజిస్ట్రేషన్ కోసం చెల్లించే ఫీజుకు అదనంగా కొంత సొమ్మును డీలర్లు వసూలు చేస్తున్నారట. దానికి ఎలాంటి వివరణ, రసీదు ఉండదు.
అంటే ఆర్‌టిఎ ఆఫీసుకు కొత్త బ్రోకర్ వ్యవస్థగా డీలర్లు పని చేస్తున్నారన్నమాట. ఫైల్ ఆన్‌లైన్‌లో వచ్చినా వసూళ్లకు ఎలాంటి భంగం కలగలేదు. ఆర్‌టిఎ ఆఫీసుల వద్ద కనబడే ప్రత్యక్ష దళారుల గురించి అధికారులను ప్రశ్నించే అవకాశం ఉండేది. బాధితులు ఎవరైనా గట్టిగా అడిగినప్పుడు పోలీసుల సాయంతో ఈ పగటి దొంగలను బయటికి పంపించిన ఘటనలు ఉన్నాయి. డీలర్లు అదనంగా వసూలు చేసే సొమ్ముపై ఎవరికీ ఫిర్యాదు చేయాలో అర్థం కావడం లేదని బాధితులు అంటున్నారు. అవినీతికి ఆస్కారమున్న అధికారులకు ప్రజలు చిక్కకుండా ప్రవేశపెట్టిన ఏ విధాన్నానైనా విఫలం చేసే చాతుర్యం మనవాళ్లకుంది. అందుకు విరుగుడుగా ప్రభుత్వ ఆఫీసులకు ఆన్‌లైన్‌లో వచ్చిన అప్లికేషన్ల పరిస్థితిని తనిఖీ చేసే వ్యవస్థ కావాలి. అది నిజాయితీ గల సివిల్ సర్వెంట్ ఆధ్వర్యంలో నడవాలి. తరచూ, ఆకస్మిక దాడుల ద్వారా కొంతలో కొంతైనా ప్రయోజనం ఉండొచ్చు.
– బి.నర్సన్
94401 28169