Reading Time: 2 minutes
Dacoit Movie Review: డెకాయిట్ సినిమా రివ్యూ.. అడివి శేష్ మరో హిట్ కొట్టాడా..?

మూవీ రివ్యూ: డెకాయిట్

నటీనటులు: అడివి శేష్, మృణాల్ ఠాకూర్, అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్ తదితరులు

సినిమాటోగ్రఫీ: దనుష్ భాస్కర్

సంగీతం: భీమ్స్ సిసిరోలియో

దర్శకత్వం: షానియల్ డియో

స్క్రీన్ ప్లే & కథ: అడివి శేష్

నిర్మాతలు: సుప్రియ యార్లగడ్డ, సునీల్ నారంగ్

 

కథ:

అణగారిన వర్గానికి చెందిన యువకుడు హరి దాస్ అలియాస్ రోమియో (అడివి శేష్).. అగ్ర వర్ణానికి చెందిన సరస్వతి అలియాస్ జూలియట్ (మృణాల్ ఠాకూర్) గాఢంగా ప్రేమించుకుంటారు. ఒకరికొకరు ప్రాణంగా బతుకుతున్న క్రమంలో, అనుకోని పరిస్థితుల్లో ఓ హత్య కేసులో హరి జైలు పాలవుతాడు. ఆశ్చర్యకరంగా హరినే ఆ నేరం చేశాడని నమ్మించి అతనికి శిక్ష పడేలా చేస్తుంది సరస్వతి. ప్రాణంగా ప్రేమించిన అతన్ని ఆమె ఎందుకు జైలుకు పంపింది..? తనను మోసం చేసిన సరస్వతిపై హరి ఎలా పగ తీర్చుకున్నాడు..? అసలు సరస్వతి గతం ఏంటి..? చివరికి వీళ్ళ జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయి..? అన్నదే ఈ చిత్ర కథ..

కథనం:

అడివి శేష్ సినిమా అంటే రొటీన్ గా ఉండదనే నమ్మకం ఉంది. డెకాయిట్ విషయంలో ఇదే జరిగింది. శేష్ గత సినిమాలతో పోలిస్తే ఇది వీక్ సినిమా కానీ నిరాశ పరచదు. కథ పరంగా రొటీన్ ఇది.. కానీ స్క్రీన్ ప్లే కాస్త కొత్తగా ఉంది.
ముఖ్యంగా మొదటి అరగంట చాలా నచ్చింది. ఎమోషన్స్ తో కూడిన ఒక బలమైన పాయింట్ ను దర్శకుడు షానియల్ డియో ఎంచుకున్నాడు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్, హీరోయిన్ కోణంలో వచ్చే సన్నివేశాలను తెరపై బాగా ప్రెజెంట్ చేశాడు. అయితే కథనంలో వచ్చే ట్విస్టులు ఆశించిన స్థాయిలో థ్రిల్ చేయవు.ఆర్ట్ ఫిల్మ్ తరహాలో సాగడం వల్ల రెగ్యులర్ మాస్ ప్రేక్షకులకు ఈ సినిమా ఏ మేరకు కనెక్ట్ అవుతుందనేది చూడాలి.

శేష్ గత సినిమాల్లో మేజర్ ప్లస్ స్క్రీన్ ప్లే.. కానీ డెకాయిట్ లో ఆ పేస్ మిస్ అయింది. క్లైమాక్స్ ఏదో ట్రై చేశారు కానీ పాతికేళ్ల నాటి శ్రీకాంత్ సినిమా గుర్తుకొస్తుంది. అడివి శేష్ ఫస్ట్ టైమ్ కమర్షియల్ హీరోగా ట్రై చేశాడు.. కానీ వీటికంటే డిఫరెంట్ సినిమాలే ఈయనకు బాగా సూట్ అవుతాయి. సెకండ్ హాఫ్ లో గ్రాఫ్ కాస్త పడిపోయినప్పటికీ, అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు స్లో అయినా.. క్లైమాక్స్ లోని ఎమోషనల్ సీన్స్ తో కథనాన్ని ముగించిన తీరు మెప్పిస్తుంది. లాజిక్స్ పక్కనపెడితే మేకింగ్ అండ్ టేకింగ్ పరంగా దర్శకుడు సక్సెస్ అయ్యాడు. కాకపోతే ప్రకాష్ రాజ్, అనురాగ్ కశ్యప్ లాంటి స్టార్ కాస్ట్ ఉన్నా కూడా పెద్దగా వాడుకోలేదు.

నటీనటులు:

అడివి శేష్ తన మార్క్ నటనతో ఈ సినిమాను భుజాన వేసుకున్నాడు. రెండు విభిన్నమైన గెటప్స్ లో అదరగొట్టాడు. యాక్షన్ సీన్స్, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ తో తన పాత్రకు ప్రాణం పోశాడు. మృణాల్ ఠాకూర్ హోమ్లీ లుక్ లో అందంగా కనిపించడమే కాకుండా, తన నటనతో ఎమోషన్స్ ను అద్భుతంగా పలికించింది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ తెరపై చాలా నేచురల్ గా పండింది. బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ నటన చాలా రియలిస్టిక్ గా ఉండి సర్ ప్రైజ్ చేస్తుంది. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తన అనుభవాన్ని రంగరించి మెప్పించగా, సునీల్ తదితరులు తమ పాత్రల పరిధి మేర నటించి ఆకట్టుకున్నారు.

టెక్నికల్ టీం:

భీమ్స్ సిసిరోలియో సంగీతం సినిమాకు మరో ప్లస్ పాయింట్. ముఖ్యంగా క్లైమాక్స్ ఎమోషనల్ సీన్స్ లో ఆయన ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని పెంచింది. సాంకేతికంగా సినిమా చాలా రిచ్ గా ఉంది. దనుష్ భాస్కర్ అందించిన సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన బలం. ప్రతి ఫ్రేమ్ చాలా కలర్ ఫుల్ గా, కథలోని మూడ్ కి తగ్గట్టుగా సాగింది. కోదాటి పవన్ కళ్యాణ్ ఎడిటింగ్ పర్వాలేదు. సుప్రియ యార్లగడ్డ, సునీల్ నారంగ్ ల నిర్మాణ విలువలలో ఎక్కడా రాజీ పడలేదు, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.

పంచ్ లైన్:

ఓవరాల్ గా డెకాయిట్.. డిఫరెంట్ యాక్షన్ లవ్ స్టోరీ..!