
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ప్రతి మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. మొన్న యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రా, నిన్న స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో ఊచకోత కోశాడు. ఇటీవల గువహటి వేదికగా ముంబై ఇండియన్స్(MI), రాజస్థాన్ రాయల్స్(RR) మధ్య జరిగిన మ్యాచ్‌లో రెచ్చిపోయాడు. తొలిసారి జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కొన్న వైభవ్ సూర్యవంశీ దుమ్మురేపాడు. ఈ 15 ఏళ్ల కుర్రాడు బుమ్రా వేసిన ఫస్ట్ బాల్‌కే సిక్సర్ కొట్టాడు. బుమ్రా వేసిన ఆ లూజ్ డెలివరీని సరిగ్గా వాడుకున్న సూర్యవంశీ, లాంగ్-ఆన్ మీదుగా భారీ సిక్సర్ బాదాడు. దానికి బుమ్రా కేవలం చిరునవ్వు నవ్వి తన మార్క్ వైపు వెనుదిరిగాడు. కానీ ఆట అక్కడితో ఆగలేదు. అదే ఓవర్ నాలుగో బంతికి బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్ మీదుగా సూర్యవంశీ మరో సిక్సర్ బాదాడు. ఇప్పటికే భయం, బెదురు లేకుండా అందరి ఓవర్లలో సిక్సర్ల మోత మోగించిన వైభవ్.. చివరికి ప్రపంచం మెచ్చిన యార్కర్ కింగ్ బుమ్రా బౌలింగ్‌లోనూ ఆధిపత్యం ప్రదర్శించాడు.
READ MORE: Gold Seized: ఎయిర్ పోర్ట్ లో భారీగా బంగారం పట్టివేత.. లేడీ స్మగ్లర్స్ నుండి 30 కేజీల బంగారం సీజ్
ఇక నిన్న (శుక్రవారం) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ దుమ్మురేపాడు. గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో వైభవ్ 26 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 78 పరుగులు చేశాడు. కేవలం 15 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేశాడు. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఆధారంగా, రాజస్థాన్ ఈ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్‌లో స్టార్ బౌలర్ భువనేశ్వర్‌ను సైతం వదల్లేదు. అనుభవజ్ఞులైన జోష్ హేజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్ వంటి బౌలర్లను సైతం లక్ష్యంగా చేసుకుని భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. భువనేశ్వర్ వేసిన తొలి ఓవర్లోనే రెండు ఫోర్లతో ఖాతా తెరిచిన ఈ కుర్రాడు, రెండో ఓవర్లో యశస్వి జైస్వాల్ అవుటైనప్పటికీ ఏమాత్రం తగ్గలేదు. హేజిల్‌వుడ్ వేసిన వరుసగా నాలుగు బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్ బాది స్టేడియంను హోరెత్తించాడు. ఈ సీజన్‌లో సూర్యవంశీ ఇలా 15 బంతుల్లోనే అర్ధశతకం బాదడం ఇది రెండోసారి కావడం విశేషం. గతంలో చెన్నై సూపర్ కింగ్స్‌పై కూడా బర్సపరా స్టేడియంలో ఇదే ఘనత సాధించాడు. ఇలా వరుసగా స్టార్ బౌలర్లకు వైభవ్ చుక్కలు చూయిస్తున్నాడు.