Reading Time: < 1 minute
Asim Munir Khawaja Asif Israel Tweet Deleted Pakistan Credibility

Pakistan: సాధారణంగా ఏ దేశంలో అయినా రక్షణ మంత్రికి ఆర్మీ చీఫ్‌లు జవాబుదారీగా ఉంటారు. రక్షణ మంత్రి ఆదేశాలను పాటిస్తారు. కానీ పాకిస్తాన్‌లో మాత్రం బయటకు ప్రజా ప్రభుత్వం కనిపిస్తున్నా, నడిపించేది అంతా పాకిస్తాన్ సైన్యమే. ఆ దేశంలో అత్యంత పవర్ ఫుల్ వ్యక్తి ఆర్మీ చీఫ్. ఇప్పుడు ఆ పదవిలో అసిమ్ మునీర్ ఉన్నారు. మునీర్ చెప్పినట్లు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆడుతున్నారు. ఇక ఇతర మంత్రులు సంగతి చెప్పనక్కర లేదు.

ఇదిలా ఉంటే, తాజాగా పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా అసిఫ్‌ను ఆర్మీ చీఫ్, సైన్యాధిపతి అసిమ్ మునీర్ తీవ్రంగా మందలించినట్లు తెలుస్తోంది. రక్షణ మంత్రి ఇజ్రాయిల్‌ను ‘‘మానవాళికి శాపం’’గా అభివర్ణిస్తూ ఒక సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు. దీనిపై ఇజ్రాయిల్ స్పందిస్తూ.. పాకిస్తాన్ మధ్యవర్తిత్వ సామర్థ్యాలను ప్రశ్నించింది. అమెరికా-ఇరాన్ చర్చల వేళ ఈ ట్వీట్ వివాదాస్పదంగా మారింది. దీంతో వెంటనే ఈ ట్వీట్ డిలీట్ చేయాలని ఆసిమ్ మునీర్, రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్‌ను ఆదేశించారు. ఇలాంటి బాధ్యతారహితమైన పోస్టులు పెట్టొద్దని హెచ్చరించినట్లు నివేదికలు చెబుతున్నారు.

Read Also: Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. శాతవాహన, గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌లు రద్దు..

మరోవైపు, పాకిస్తాన్ సొంత మంత్రుల బాధ్యతారహిత ప్రవర్తననను నియంత్రించలేకపోతుందని అమెరికా ఎక్కువగా భావిస్తోందని, ఈ పరిస్థితి పాక్ మధ్యవర్తిత్వ పాత్రను బలహీనపరుస్తుందని, అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ ప్రక్రియకు అంతరాయం కలిగించే ప్రమాదం ఉందని ఆ వర్గాలు తెలిపాయి. ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ నేతృత్వంలోని పాకిస్తాన్ సైన్యం విదేశాంగ విధానంపై నిర్ణయాత్మక నియంత్రణను కొనసాగిస్తోందని, దీంతో ఎన్నికైన ప్రభుత్వానికి పరిమిత అధికారాలు మాత్రమే మిగిలాయని ఆ నివేదిక ఇంకా పేర్కొంది.

ఇలాంటి సమయంలో మధ్యవర్తిత్వం విఫలమైతే గల్ఫ్ లో మళ్లీ ఘర్షణలు చెలరేగే ప్రమాదం ఉందని పాకిస్తాన్ భావిస్తోంది. ఇప్పటికే ఈ యుద్ధం వల్ల పాక్ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగింది. ఇంధన కొరతతో పాక్ ప్రజలు సతమతమవుతున్నారు. ఖ్వాజా ఆసిఫ్ ఇజ్రాయిల్ పోస్ట్‌పై అసిమ్ మునీర్ కలుగజేసుకోవడంతోనే దానిని డిలీట్ చేసినట్లు తెలుస్తోంది.