
టీటీడీ లోగోను దుర్వినియోగం చేస్తూ.. శ్రీవారి విఐపి దర్శనం పేరుతో భక్తులను మోసం చేస్తున్న తమిళనాడుకు చెందిన సెంథిల్ కుమార్‌ను అనే వ్యక్తిని టీటీడీ విజిలెన్స్ అధికారుల ఫిర్యాదుతో అరెస్ట్ చేశారు పోలీసులు. వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్‌స్టా వేదికగా ప్రకటనలు చేస్తూ త్వరితగతిన శ్రీవారి దర్శనం, 5 అడుగుల దూరంలో దర్శనమంటూ ఇతను భక్తుల బురిడీ కొట్టించినట్టు పోలీసుల గుర్తించారు. ఇలా భక్తల నుంచి ఒక్కో టిక్కెట్‌కు రూ 16,500 వరకు వసూలు చేసినట్టు దర్యాప్తులో పోలీసులు తెలుసుకున్నారు.
దీంతో అతని దగ్గర నుంచి టిటిడి లోగోతో పాటు ల్యాప్‌టాప్, రెండు మొబైల్స్, టికెట్స్ బుకింగ్ డేటా, AI వీడియోలు, సోషల్ మీడియా చాట్ రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇతనిపై తిరుమల వన్, టూ టౌన్ పోలీస్ స్టేషన్లలోనూ పలు కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తిరుమల II టౌన్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నం.16/2026 U/s 318(4) BNS, తిరుమల I టౌన్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నం.12/2026 U/s 353(2), 298 BNS కేసులను ఇతనిపై పోలీసులు నమోదు చేసారు.
భక్తులకు టీటీడీ సూచనలు
రోజురోజుకూ నకిళీ గాళ్లు పెరుగుతున్న నేపథ్యంలో భక్తులకు టీటీడీ కీలక సూచనలు జారీ చేసింది. శ్రీవారి దర్శన టికెట్లను కేవలం అధికారిక TTD వెబ్‌సైట్ లేదా అనుమతించబడిన కౌంటర్ల ద్వారా మాత్రమే పొందాలని తెలిపింది. సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలను నమ్మవద్దని, అనుమానాస్పద సమాచారం ఉన్నప్పుడు సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని పోలీసు యంత్రాంగం కోరింది. ఎవరికీ ముందస్తుగా డబ్బులు చెల్లించవద్దని తెలిపింది. గూగుల్ సెర్చ్‌లో నందకం, రాంబగీచ, పాంచజన్యం, పద్మావతి గెస్ట్ హౌస్ పేర్లతో కనిపించే వెబ్‌సైట్ లింకులు అన్ని అధికారికమైనవి కావని తెలిపింది.
అధికారిక TTD వెబ్‌సైట్ http://ttdevasthanams.ap.gov.in ను మాత్రమే భక్తులు వినియోగించమని కోరుతోంది. స్వామివారి దర్శనాలు, రూముల పేరుతో శ్రీవారి భక్తులను మోసం చేసే వారిపై నిరంతరం నిఘా ఉంటుందని.. ఇటువంటి చర్యలకు పాల్పడే వారిపై కఠినమైన తీసుకుంటామని పోలీస్ యంత్రాంగం హెచ్చరిస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.