Reading Time: 3 minutes

నిత్యం మనం తీసుకునే ఆహారం అమృతం కావాలి. కానీ నేడు అది నెమ్మదిగా ప్రాణాలను హరించే విషంగా మారుతోంది. లాభాపేక్ష అనే రాక్షసి కోరల్లో చిక్కుకున్న ఆహార రంగం, సామాన్యుడి ఆరోగ్యంతో చెలగాటమాడుతోంది. ‘సర్వం కల్తీమయం’ అన్నది కేవలం ఒక నానుడి కాదు. నేడు అది మన కళ్లముందు కదలాడుతున్న భయంకర వాస్తవం. భారతదేశంలో సామాన్య ప్రజల జీవన ప్రమాణాలు పెరగడం అటుంచితే, కనీస ఆరోగ్య భద్రత కరువవ్వడం ఆందోళన కలిగించే అంశం. వాతావరణ కాలుష్యం ఒకవైపు ఊపిరితిత్తులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే, మరోవైపు మనం తినే ఆహారంలో చేరుతున్న రసాయనాలు నిశ్శబ్దంగా మృత్యువును ఆహ్వానిస్తున్నాయి. ఉదయం నిద్రలేచిన దగ్గరి నుండి వాడే టూత్‌పేస్ట్, పాలు, టీపొడి, వంటనూనె, పప్పుధాన్యాలు.. ఇలా ఒకటేమిటి, ఏ వస్తువును తాకినా అందులో కల్తీ ఉందన్న వార్తలు వినియోగదారుడి వెన్నులోవణుకు పుట్టిస్తున్నాయి.

గతంలో కల్తీ అంటే ఏదో ఒక వస్తువులో తక్కువ నాణ్యత గల పదార్థాలను కలపడం అని అనుకునేవారు. కానీ నేడు అది ఒక వ్యవస్థీకృత నేరంగా రూపాంతరం చెందింది. ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన దాడులు చూస్తుంటే, ఒక భారీ నెట్‌వర్క్ దీని వెనుక ఉన్నట్లు అర్థమవుతోంది. పాలు, పాల ఉత్పత్తులు: సూరత్ వంటి నగరాల్లో యూరియా, డిటర్జెంట్, ప్రాణాంతక రసాయనాలతో ‘సింథటిక్ పాలు’ తయారు చేయడం మానవత్వం లేని చర్య. పసిపిల్లలు తాగే పాలపై కూడా కనికరం లేని లాభాపేక్ష ఇది. పన్నీర్, నెయ్యిలో జంతువుల కొవ్వును కలపడం వంటి ఘటనలు ఆధ్యాత్మిక భావనలతోపాటు ఆరోగ్య భద్రతను కూడా దెబ్బతీస్తున్నాయి. ఢిల్లీలో వెలుగులోకి వచ్చిన నకిలీ టూత్‌పేస్ట్ తయారీ కేంద్రం మన దైనందిన జీవితంలో ఏ వస్తువునూ నమ్మలేమని నిరూపించింది. బ్రాండెడ్ కంపెనీల పేర్లతో నకిలీ ప్యాకింగ్ చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు.

రీ-లేబులింగ్ మాఫియా: గడువు ముగిసిన సాఫ్ట్‌డ్రింక్స్, ప్యాక్డ్ ఫుడ్స్‌పై పాత తేదీలను చెరిపివేసి కొత్త తేదీలు ముద్రించడం ద్వారా వినియోగదారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ప్రస్తుత ఆధునిక సమాజంలో నగర జీవనం చాలా వేగంగా మారిపోయింది. ఉరుకులు పరుగుల జీవితంలో సొంతంగా వంట చేసుకునే తీరిక లేక చాలామంది బయటి ఆహారంపై ఆధారపడుతున్నారు. బిర్యానీ సెంటర్లు, టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ అవుట్‌లెట్లు నేడు ప్రతి గల్లీలోనూ దర్శనమిస్తున్నాయి. అయితే, ఈ కేంద్రాల్లో శుభ్రత అనేది మచ్చుకైనా కనిపించడం లేదు. హైదరాబాద్ వంటి నగరాల్లో వెలుగులోకి వచ్చిన అల్లం- వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రాల పరిస్థితి దారుణం. కుళ్ళిన అల్లం, వెల్లుల్లికి రంగులు, రసాయనాలు కలిపి ఆకర్షణీయమైన ప్యాకింగ్‌తో హోటళ్లకు సరఫరా చేస్తున్నారు. ఇలాంటి పదార్థాలను వాడటం వల్ల హోటల్ ఆహారం రుచికరంగా ఉన్నట్లు అనిపించినా, అది లోలోపల అవయవాలను చిత్తు చేస్తోంది.

కల్తీ ఆహారం అనేది కేవలం ఒక వ్యక్తిగత సమస్య కాదు, ఇది దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద ప్రజారోగ్య సంక్షోభం. కల్తీ వల్ల కలిగే నష్టాలు తక్షణమే బయటపడవు. కానీ దీర్ఘకాలంలో అవి ప్రాణాంతకమవుతాయి. కేన్సర్ ముప్పు: వైద్య నిపుణుల నివేదికల ప్రకారం, దేశంలో నమోదవుతున్న కేన్సర్ కేసుల్లో సుమారు 53% ఆహారపు అలవాటు, కల్తీ ఆహారం వల్లే సంభవిస్తున్నాయి. ఆహారంలో కలిపే కృత్రిమ రంగులు కార్సినోజెనిక్‌గా మారుతున్నాయి. కలుషిత నీరు, కల్తీ పాలు, నాణ్యత లేని నూనెల వల్ల కాలేయం, మూత్రపిండాలు దెబ్బతింటున్నాయి. చిన్న వయస్సులోనే గుండెపోటులు రావడం వెనుక కల్తీ నూనెల ప్రభావం ఎంత ఉందో విశ్లేషించాల్సిన అవసరం ఉంది.

పాలలో కలిపే ఆక్సిటోసిన్ వంటి హార్మోన్ల వల్ల పిల్లల ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. నిఘా వైఫల్యం ప్రశ్నలపై ఉక్కుపాదం ఆహార భద్రతా ప్రమాణాలను పర్యవేక్షించాల్సిన ‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా’, రాష్ట్ర ప్రభుత్వాల ఆరోగ్యశాఖలు క్షేత్రస్థాయిలో విఫలమవుతున్నాయని చెప్పక తప్పదు. తనిఖీలు కేవలం పండుగ సీజన్లకు లేదా ఫిర్యాదులు వచ్చినప్పుడు మాత్రమే పరిమితం కాకూడదు. మరోవైపు, సోషల్ మీడియా యుగంలో ప్రజలు చైతన్యవంతులవుతున్నారు. ఆహార నాణ్యతను ప్రశ్నించే వారిపై రివర్స్ కేసులు నమోదు చేయడం లేదా వారిని వేధించడం ప్రజాస్వామ్య విరుద్ధం. ప్రశ్నించే గొంతును నొక్కేయడం వల్ల సమస్య పరిష్కారం కాదు, అది మరింత విస్తరిస్తుంది. ప్రభుత్వాలు పారదర్శకతను పెంచాలి. తనిఖీ వివరాలను, కల్తీకి పాల్పడే సంస్థల పేర్లను బహిరంగ పరచాలి.

ప్రభుత్వం కేవలం జరిమానాలతో సరిపెట్టకుండా, కల్తీకి పాల్పడే వారిని సామాజిక నేరగాళ్లుగా పరిగణించి కఠిన శిక్షలు అమలు చేయాలి. ఆహార కల్తీకి పాల్పడే వారికి జీవిత ఖైదు వంటి కఠిన శిక్షలు పడేలా చట్టాలను సవరించాలి. హోటళ్లు, తయారీ కేంద్రాలపై ఆకస్మిక దాడులు నిరంతర ప్రక్రియగా మారాలి. డిజిటల్ ట్రాకింగ్ ద్వారా ఆహార పదార్థాల మూలాలను గుర్తించే వ్యవస్థను బలోపేతం చేయాలి. ప్రతి జిల్లా కేంద్రంలో అత్యాధునిక ఆహార పరీక్షా ప్రయోగశాలలను ఏర్పాటు చేయాలి. సామాన్య ప్రజలు కూడా అతి తక్కువ ధరకే తమ ఆహారాన్ని పరీక్షించుకునే సౌలభ్యం కల్పించాలి. ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసినా, ప్రజల్లో చైతన్యం లేనిదే మార్పు రాదు. ఏదైనా వస్తువు కొనే ముందు ఎక్స్‌పైరీ డేట్, తయారీదారు వివరాలు, ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ లోగోను తప్పనిసరిగా చూడాలి. వీలైనంత వరకు ప్రాసెస్ చేసిన ఆహారం కాకుండా ప్రకృతి సిద్ధమైన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి.

బయట ఆహారం తీసుకునేటప్పుడు కేవలం పేరు ప్రఖ్యాతులు కాకుండా, అక్కడ పాటించే పరిశుభ్రతను కూడా గమనించాలి. నాణ్యత లేని వస్తువును చూసినప్పుడు మౌనంగా ఉండకుండా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడం బాధ్యతగా భావించాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆ భాగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. వ్యాపారులు లాభాల వేటలో ప్రాణాలను బలితీసుకోవడం ఆపాలి. ప్రభుత్వం తన నిద్రావస్థను వీడి, ఉక్కుపాదంతో కల్తీ మాఫియాను అణచివేయాలి. సమాజం పార్టీ సంస్కృతికి, నిల్వఉంచిన రుచికరమైన విషాలకు దూరంగా ఉండాలి. మనం ఇప్పుడే మేల్కోకపోతే, రేపటి తరం ఒక అనారోగ్యకరమైన సమాజంలో బతకాల్సి వస్తుంది. ఆహార భద్రత అనేది కేవలం ఒక నినాదం కాదు, అది ఒక ప్రాథమిక హక్కు. ఆ హక్కును కాపాడుకోవడానికి పౌర సమాజం సిద్ధం కావాలి.

– ముద్దం నరసింహస్వామి

9949839699