
గౌహతి: హ్యాట్రిక్ విజయాలతో జోరుమీదున్న రాజస్థాన్ రాయల్స్ శుక్రవారం డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగే పోరుకు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచుల్లోనూ రాజస్థాన్ జయకేతనం ఎగుర వేసింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలంగా ఉన్న రాజస్థాన్ ఈ మ్యాచ్‌లోనూ అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. ఇక బెంగళూరు ఆడిన రెండు మ్యాచుల్లోనూ జయకేతనం ఎగుర వేసింది. ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవాలనే పట్టుదలతో ఉంది. ఇరు జట్లలోనూ ప్రతిభాంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. దీంతో పోరు ఆసక్తికరంగా సాగాడు.
జోరు సాగిస్తారా..
యువ ఓపెనర్లు యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీలు ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అసాధారణ బ్యాటింగ్‌తో చెలరేగి పోయారు. ఇద్దరు విధ్వంసక బ్యాటింగ్‌తో రాజస్థాన్‌కు భారీ స్కోరు సాధించి పెట్టారు. ఈ మ్యాచ్‌లో కూడా వీరిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ట్రెంట్ బౌల్ట్, బుమ్రా వంటి ప్రపంచ స్థాయి బౌలర్లు ఉన్న ముంబైపై వీరు సునామీ ఇన్నింగ్స్‌లతో విరుచుకు పడ్డారు. బెంగళూరుపై కూడా చెలరేగేందుకు సిద్ధమయ్యారు. యువ ఆటగాళ్లు జోరుమీదుండడం రాజస్థాన్‌కు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. ఇద్దరు చెలరేగితే రాజస్థాన్‌కు మరోసారి భారీ స్కోరు సాధించడం కష్టం కాకపోవచ్చు. రియాన్ పరాగ్, హెట్‌మెయిర్, ధ్రువ్ జురేల్, రవీంద్ర జడేజా వంటి స్టార్ ఆటగాళ్లు జట్టులో ఉన్నారు.
అంతేగాక ఆర్చర్, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లతో బౌలింగ్ కూడా బాగానే ఉంది. ఇక బెంగళూరులో కూడా స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఛాలెంజర్స్ ఆలవోక విజయాలను సాధించింది. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. రజత్ పటిదార్, జితేశ్ శర్మ, విరాట్ కోహ్లి, పడిక్కల్, ఫిలిప్ సాల్ట్, డేవిడ్, షెఫర్డ్, కృనాల్ పాండ్య వంటి స్టార్‌లు జట్టులో ఉన్నారు. దీంతో ఈ మ్యాచ్‌లో బెంగళూరుకు కూడా గెలుపు అవకాశాలు మెరుగ్గానే కనిపిస్తున్నాయి.