
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో ఆటగాళ్ల గాయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే పలువురు ఆటగాళ్లు గాయాల కారణంగా పూర్తి సీజన్‌కి దూరమైతే.. మరికొందరు కొన్ని మ్యాచ్‌ల తర్వాత జట్టుతో జతకడతారని ఫ్రాంచైజీలు చెబుతున్నాయి. తాజాగా మరో జట్టుకు షాక్ తగిలింది. వరుస విజయాలతో జోష్ మీదున్న లక్నో జట్టుకి స్టార్ ఆల్ రౌండర్ దూరమయ్యాడు. గాయం కారణంగా వనిందు హసరంగా ఐపిఎల్ 2026 సీజన్‌లో ఆడటం లేదని మేనేజ్‌మెంట్ ప్రకటించింది. గత వరల్డ్ కప్ జరిగిన సమయంలో హసరంగ గాయపడ్డాడు. అతడి ఫిట్‌నెస్‌కు సంబంధించి శ్రీలంక క్రికెట్ బోర్డు ఎన్‌వొసి జారీ చేయలేదు. ఈ వారంలోనే హసరంగకు ఫిట్‌నెస్ పరీక్షలు పూర్తయ్యాయి. ఐపిఎల్ విషయానికొస్తే.. గత మినీ వేలంలో హసరంగను లక్నో.. రూ.2 కోట్లకు దక్కించుకుంది.
అయితే హసరంగ స్థానంలో మరో ఆటగాడిని జట్టులోకి తీసుకొనే విషయంపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని లక్నో ఫ్రాంచైజీ డైరెక్టర్ టామ్ మూడీ వెల్లడించారు. ‘‘హసరంగ లక్నో జట్టుతో జాయిన్ కావడం లేదు. అందుకోసం మేం సన్నద్ధమయ్యాం. అతడి స్థానంలో ఎవరిని తీసుకుంటామనే నిర్ణయం 24-48 గంటల్లోగా తీసుకుంటాం’’ అని మూడీ తెలిపారు.