Reading Time: 2 minutes

హెచ్‌‌‌‌పీవీ వ్యాక్సినేషన్‌‌‌‌లో సిద్దిపేట థర్డ్‌‌‌‌ ప్లేస్‌‌‌‌ 

Caption of Image.
  •  జిల్లాలో ఇప్పటివరకు 1,370 మందికి వ్యాక్సిన్‌‌‌‌
  •   ప్రస్తుతం ఆరు సెంటర్లలో వ్యాక్సినేషన్.. మరో 13 సెంటర్లు పెంపు 

సిద్దిపేట, వెలుగు:  మహిళల్లో గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ నివారణ కోసం ప్రారంభించిన హెచ్‌‌‌‌పీవీ((హ్యూమన్ పాపిలోమా వైరస్) వ్యాక్సినేషన్‌‌‌‌లో సిద్దిపేట జిల్లా రాష్ట్రంలోనే థర్డ్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో నిలిచింది. 14 నుంచి 15 ఏండ్లలోపు పిల్లలకు ఈ వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తారు. నెల రోజుల కింద వ్యాక్సినేషన్‌‌‌‌ ప్రారంభం కాగా ఇప్పటివరకు జిల్లాలో 1,370 మంది బాలికలకు 1970 డోసులు పంపిణీ చేశారు.

రాష్ట్రంలో ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల తర్వాత సిద్దిపేట జిల్లా నిలిచింది. హెచ్‌‌‌‌పీవీ టీకాను సిద్దిపేట, గజ్వేల్ జిల్లా ఆసుపత్రులు, దుబ్బాక ఏరియా హాస్పిటల్‌‌‌‌తోపాటు హుస్నాబాద్, చేర్యాల, నంగునూరు సీహెచ్‌‌‌‌సీలో మార్చి 8 నుంచి ప్రారంభించారు. జిల్లాలో ఈ టీకా తీసుకునేందుకు 10,147 మంది బాలికలను అర్హులుగా గుర్తించారు. మొదట ఆరు సెంటర్ల లో వ్యాక్సినేషన్ ప్రారంభం కాగా.. ప్రస్తుతం మరో 13 పీహెచ్‌‌‌‌సీల్లో వీటిని అందుబాటులోకి తెచ్చారు. 

క్యాన్సర్‌‌‌‌‌‌‌‌పై ప్రత్యేక సర్వే 

సిద్దిపేట జిల్లాలో క్యాన్సర్‌‌‌‌‌‌‌‌ గుర్తింపునకు ఇటీవల వైద్యాధికారులు ప్రత్యేక సర్వే చేశారు. ఈ సర్వేలో మొత్తం 519 మంది వివిధ రకాలైన క్యాన్సర్ పేషంట్లు ఉన్నట్టు గుర్తించారు. ఇందులో 99 మంది మహిళలు గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్‌‌‌‌‌‌‌‌తో బాధపడుతున్నారు. మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, పొల్యూషన్ కారణంగా క్యాన్సర్ రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా మహిళలు రొమ్ము, గర్బాశయ క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో చిన్న వయసులోనే  క్యాన్సర్ నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం హెచ్‌‌‌‌పీవీ వ్యాక్సిన్‌‌‌‌ను ప్రారంభించింది. దేశ వ్యాప్తంగా 14 నుంచి 15 ఏండ్లలోపు బాలికలకు ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా ప్రారంభించింది. 

వ్యాక్సినేషన్‌‌‌‌పై విస్తృత అవగాహన

హెచ్‌‌‌‌పీవీ వ్యాక్సినేషన్‌‌‌‌పై బాలికల తల్లిదండ్రులకు అవగాహన కల్పించడమే కాకుండా సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. తల్లిదండ్రుల అనుమతితోనే బాలికలకు టీకాలు ఇస్తున్నారు. వ్యాక్సినేషన్ ప్రారంభించి నెల రోజులు కావస్తున్నా అపోహల కారణంగా ఆశించిన మేర స్పందన రావడం లేదు. ప్రస్తుత సమాజంలో మహిళలే ఎక్కువగా క్యాన్సర్ బారిన పడుతున్నందున ముందు జాగ్రత్తగా ఈ వ్యాక్సినేషన్‌‌‌‌ ఇస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో హెచ్‌‌‌‌పీవీ వ్యాక్సినేషన్ ఆశించిన మేర జరుగుతోందని డీఎంహెచ్‌‌‌‌వో ధనరాజ్ తెలిపారు. వ్యాక్సినేషన్ లో సిద్దిపేట జిల్లా మూడో స్థానంలో నిలిచిందని, దీని పై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు. 

 

©️ VIL Media Pvt Ltd.