Reading Time: < 1 minute

అమరావతి: మాజీ సిఎం వైసిపి జగన్ మోహన్ రెడ్డి పిలుపుతో మావిగన్ కు ఒక రూపం వచ్చిందని వైసిపి నేత సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. మావిగన్ లో రోడ్డు, రైలు కనెక్టివిటీ ఉన్నాయని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతికి పెట్టే ఖర్చులో 10% మావిగన్ లో పెడితే చాలని, మావిగన్ కు త్వరలో పోర్టు కూడా వస్తుందని తెలియజేశారు. జగన్ అన్నట్లు మావిగన్ కు అన్ని కనెక్టివిటీలు ఉన్నాయని, మావిగన్ ప్రతిపాదనను ప్రజలు కూడా మెచ్చుకుంటున్నారని అన్నారు. జగన్ ప్రతిపాదన తర్వాత ప్రజల్లో చర్చ మొదలైందని, అమరావతి కోసం అప్పు చేయకుండా ఆచరణ ఎలా సాధ్యం? అని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణానికి డబ్బు ఎక్కడి నుంచి తెస్తారని, తెచ్చిన అప్పులను ఎలా తీరుస్తారని ప్రశ్నించారు. ప్రజా జీవనం లేకుండా లైవ్ సిటీ ఎలా అవుతుందని, జగన్ చెప్పిన దానికి.. ఎపి సిఎం చంద్రబాబు చెప్పినదానికి తేడా అదేనని సజ్జల పేర్కొన్నారు.

జగన్ ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పడం లేదని, అమరావతికి ఆదాయం ఎలా వస్తుంది? అని ప్రశ్నించారు. అమరావతికి నిర్మాణానికి రూ.2 లక్షల కోట్లు కావాలని, రూ. 2లక్షల కోట్లు పెడితే వచ్చే ఆదాయం ఎంత? అని నిలదీశారు. చంద్రబాబు లెక్కల ప్రకారం 40 ఏళ్లయినా అమరావతి పూర్తి కాదని..నవ రాయపూరే ఇందుకు ఉదాహరణని పేర్కొన్నారు. రాజధాని పూర్తి కాకుండా రైతులకు ప్లాట్లు ఎలా ఇస్తారు? అని ప్రశ్నించారు. అమరావతికి చట్టబద్ధత అంటూ భ్రమలు కల్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిని అవినీతి గనిగా మార్చుకున్నారని, అమరావతిలో పెట్టుబడి పెడితే.. కృష్ణానదిలో కలిపినట్లేనని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.