Reading Time: 2 minutes
Telangana: వాట్సప్‌లో రిజిస్ట్రేషన్ సేవలు.. ఈ నెంబర్‌కు మెస్సేజ్ పెడితే సెకన్లలోనే సర్టిఫికేట్లు.. ప్రభుత్వ ఆఫీసులకు అక్కర్లేదు..

ప్రజలకు మెరుగైన డిజిటల్ సేవలు అందించడంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో సూపర్ న్యూస్ అందించింది. ప్రభుత్వ డిజిటల్ సేవలను మరింత పొడిగించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మీ సేవ వాట్సప్ సేవలను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. అంటే దీని ద్వారా మీ సేవలో పొందే సేవలన్నీ వాట్సప్‌లోనే పొందవచ్చు. దీని వల్ల మీ సేవ కార్యాలయాలకు వెళ్లాల్సిన అసవరం ఉండదు. ఈ మీ సేవ వాట్సప్ సేవల వల్ల ప్రజలకు సమయం, డబ్బులు ఆదా అవుతున్నాయి. గ్రామాల్లో మీ సేవ సెంటర్లు అందుబాటులో ఉండవు. దీంతో ప్రజలు సేవల కోసం పట్టణాలకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే వాట్సప్‌లోనే మీ సేవ సర్వీసులను పొందే సౌకర్యం అందుబాటులోకి రావడం వల్ల ప్రయాణ ఖర్చు ఆదా అవుతుంది. మీ సేవ వాట్సప్ సేవలకు అద్బుత స్పందన వస్తుంది.

వాట్సప్‌లోనే రిజిస్ట్రేషన్ సేవలు

అయితే “మీ సేవ వాట్సప్ చాట్ బాట్” సేవలను తెలంగాణ ప్రభుత్వం మరింత విస్తరించింది. ఈ మేరకు ఇందులో రిజిస్ట్రేషన్ సేవలను కూడా జోడించింది. అలాగే స్టాంప్ సేవలను కూడా అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఇక నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు, ఈసీ, స్టాంపులు వంటివి వాట్సప్‌లోనే పొందవచ్చు. అలాగే ఆన్‌లైన్‌లోనే ఫీజులు చెల్లించి ధ్రువీకరణ పత్రాలను వాట్సప్‌లోనే సులువుగా పొందవచ్చు. దీని వల్ల ప్రతీ పనికి రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని అనేది ఉండదు. భూమి పత్రాలతో పాటు సర్టిఫైడ్ కాపీల కోసం రిజిస్ట్రార్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని తప్పుతుంది. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సూచనల మేరకు రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ సేవలను మీ సేవ వాట్సప్ చాట్ బాట్‌లో ప్రవేశపెట్టారు. దీని వల్ల భూమికి సంబంధించిన డాక్యుమెంట్లను వాట్సప్ ద్వారా ప్రజలు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఎలా ఉపయోగించాలి..?

-8096958096 నెంబర్‌ను మీ ఫోన్‌లో సేవ్ చేసుకోండి

-వాట్సప్ ఓపెన్ చేసి ఆ నెంబర్‌కు హాయ్ అని మెస్సేజ్ పెట్టండి

-రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, ఎన్ కంబరెన్స్, సర్టిఫైడ్ కాపీ, స్టాంపులు, ఫ్రాంకింగ్, డెఫిసిట్ చెల్లింపులు, ఫర్మ్‌ల రిజిస్ట్రేషన్, సొసైటీలు, అపరాధ రుసుంలు, సమాచార హక్కు చట్టం వంటి ఆప్షన్లు ఉంటాయి

-మీకు కావాల్సిన సేవలను ఎంచుకోండి

-ఆ తర్వాత అప్లికేషన్ వివరాలు నింపి పేమెంట్స్ చేయండి

-అధికారుల ఆమోదం తర్వాత కాపీలు మీకు వాట్సప్‌కు వస్తాయి

-స్టాంప్స్, పెనాల్టీ చెల్లించినవారు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు వెళ్లి డాక్యుమెంట్స్ పొందవచ్చు