
హీరో అడివి శేష్ నటించిన పాన్ ఇండియా యాక్షన్- రొమాంటిక్ థ్రిల్లర్ ’డెకాయిట్’. షానియల్ డియో దర్శకుడిగా పరిచయమైన ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఏమేరకు ప్రేక్షకులను అలరించిందో తెలసుకుందాం.
కథ: హరి దాస్ (అడివి శేష్) రాయలసీమ ప్రాంతంలోని హిందూపురానికి చెందిన తక్కువ కులం కుర్రాడు. అతను ఉన్నత కులానికి చెందిన సరస్వతి (మృణాల్ ఠాకూర్)ను ప్రేమిస్తాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ ఇద్దరూ విడిపోవడమే కాదు.. హరి జైలు పాలవుతాడు. జీవిత ఖైదు అనుభవిస్తున్న అతను.. తాను ఇలా కావడానికి సరస్వతినే కారణమని రగిలిపోతుంటాడు. ఎలాగైనా జైలు నుంచి తప్పించుకుని.. సరస్వతి మీద పగ తీర్చుకోవాలని చూస్తున్న అతడికి ఓ అవకాశం వస్తుంది. దాన్ని అతను ఉపయోగించుకున్నాడా.. సరస్వతి మీద ప్రతీకారం తీర్చుకున్నాడా.. ఇంతకీ గతంలో వీరి మధ్య ఏం జరిగింది.. నిజంగా హరి జైలు పాలవడానికి సరస్వతినే కారణమా.. ఇన్నేళ్ల తర్వాత సరస్వతి ఏ స్థితిలో ఉంది.. తిరిగి సరస్వతిని కలిశాక ఆమెతో హరి ప్రయాణం ఎలా సాగింది.. అనేది ఈ సినిమా కథ.
కథనం, విశ్లేషణ: ‘క్షణం’ నుంచి ‘హిట్-2’ వరకు పకడ్బందీ థ్రిల్లర్లు అందించి ప్రేక్షకుల అభిమానా న్ని చూరగొన్నాడు హీరో అడివి శేష్. ఈ నేపథ్యంలో ‘డెకాయిట్’ మీద ఆడియన్స్ భారీ అంచనాలే పెట్టుకున్నారు. కానీ ఈ సినిమా ఈ అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో ప్రేక్షకులకు నిరాశ తప్పదు. ప్రేక్షకులు ఆశించినంత కిక్కును ఈ సినిమా ఇవ్వలేకపోయింది. తెరపై ఏం జరుగుతుందో ముందే ఊహించేయగలిగితే.. సన్నివేశాల్లో లాజిక్కులు మిస్ అయితే.. ఎమోషన్ బలంగా లేకపోతే నిరాశచెందనడం సహజం. ‘డెకాయిట్’ విషయంలో అదే జరుగుతుంది. రెండున్నర గంటలకు పైగా నిడివి ఉన్న ‘డెకాయిట్’ అక్కడక్కడా బోర్ కొట్టిస్తుంది. అయితే రేసీ స్క్రీన్ ప్లేతో కథ ఎక్కడా ఆగదు. సన్నివేశాలు పరుగులు పెడుతుంటాయి. కొన్ని సీన్లు మంచి కిక్ ఇస్తాయి కూడా. కానీ సినిమా మొత్తంగా ఇవ్వాల్సినంత కిక్కు ఇవ్వలేదు.అందుకు ప్రధాన కారణం.. ప్రధాన పాత్రలను, కథలోని కీలకమైన విషయాలను బలంగా తీర్చిదిద్దకపోవడం, ముఖ్యంగా లీడ్ పెయిర్ మధ్య ప్రేమ సన్నివేశాలను కానీ.. వారి మధ్య ఎడబాటుకు దారి తీసే సన్నివేశాలను కానీ ప్రభావంతంగా చూపించకపోవడంతో ఎమోషన్ పండలేదు. అదే సినిమాకు అతి పెద్ద మైనస్.
తాను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని నాశనం చేయాలి అనేంతగా హీరోయిన్ మీద హీరో అదే పనిగా రగిలిపోతున్నాడంటే.. అందుకు కారణాన్ని తన కోణంలో చాలా బలంగా చూపించాలి. కానీ ‘డెకాయిట్’లో అది జరగలేదు. ఇక ముఖ్య సన్నివేశాల్లో ట్విస్టులు కూడా బలవంతంగా ఇరికించినట్లు అనిపిస్తుంది. హీరో పాత్ర చిత్రణ సైతం గందరగోళంగా అనిపిస్తుంది సినిమాలో. జైల్లో ఉండగా అతడికి ఇచ్చే బిల్డప్.. తర్వాత ప్రవర్తించే తీరుకు.. గతంలో జరిగిన దానికి పొంతన లేదు.ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను బలంగా తీర్చిదిద్దుకుని ఉంటే ‘డెకాయిట్’ లెవెల్ వేరుగా ఉండేది. ఇక అడివి శేష్ నటన పర్వాలేదు. కానీ రాయలసీమ భాష, యాస అతడికి అంతగా కుదరలేదు. మృణాల్ ఠాకూర్ భావోద్వేగాలు పండించడంలో తన ప్రత్యేకతను మరోసారి చాటుకుంది. అనురాగ్ కశ్యప్.. ప్రకాష్ రాజ్ పాత్రలు అనుకున్నంత స్థాయిలో లేవు. జైన్ మేరీ ఖాన్ పాత్రలో పెద్దగా విషయం లేదు. సినిమా డైలాగుల్లో పదును లోపించింది. కథలో విషయం ఉంది కానీ.. స్క్రీన్ ప్లేలో మాయాజాలం మిస్సయింది. మొత్తానికి డెకాయిట్ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.