Reading Time: < 1 minute

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిజిఎస్‌ఆర్‌టిసి) ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కరువు భత్యం (డిఏ) ప్రకటించింది. ఈ ఏడాది సంస్థ ఉద్యోగులకు జనవరిలో ఇవ్వాల్సిన డీఏను అందజేస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. సంస్థ వైస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వై. నాగిరెడ్డి , ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, ఉన్నతాధికారులతో శుక్రవారం నిర్వహించిన సమీక్షలో మంత్రి ఈ కీలక ప్రకటన చేశారు. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 38 వేల మందికిపైగా ఆర్టీసీ సిబ్బందికి లబ్ధి చేకూరనుంది. ప్రస్తు తం ఆర్టీసీ ఉద్యోగులకు 50.7 శాతం డీఏ అందుతుండగా, తాజాగా 2.1శాతానికి పెంచారు. దీని తో మొత్తం డీఏ 52.8 శాతానికి చేరింది.

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఈ ఏడాది జనవరి 1 నుండి ఈ పెంపుదల అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించిన బకాయిలను ఏప్రిల్ నెల జీతంతో పాటు ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ పెంపు వల్ల సంస్థపై ప్రతి నెలా రూ.2.82 కోట్ల మేర ఆర్థిక భారం ప డుతుందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న డీఏలను ఈ ప్రభుత్వం వరుసగా విడుదల చేస్తూ వస్తోందని తెలిపారు. 2024 మే నెలలో ఆర్‌పిఎస్ -2017 అమలు చేసిన తర్వా త, తాజాగా ఈ 2.1 శాతం డీఏను కూడా మం జూరు చేయడంతో, ఉద్యోగులకు చెల్లించాల్సిన డీఏ బకాయిలన్నీ పూర్తయ్యాయని మంత్రి పేర్కొన్నారు. గత ఏడాది జూలై 2025లో కూడా ప్రభు త్వం 2.1 శాతం డీఏను పెంచిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

కార్మికుల సంక్షేమమే ధ్యేయం

ప్రజా పాలన ప్రభుత్వం మొదటి నుండి ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, కార్మికుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. డీఏ పెంపుతో పాటు అంతకు ముందు పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలు చేపట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాక త్రిసభ్య కమిటీ ద్వారా దీర్ఘకాలంగా విధులకు దూరమైన వారిని తిరిగి తీసుకోవడం, కార్మికుల ఆరోగ్య సంరక్షణకు ఆర్టీసీ ఆసుపత్రిని ఆధునీకరించామని పేర్కొన్నారు.