Reading Time: 2 minutes

ఎర్రవల్లి ఫామ్ హౌమ్ హౌస్ లో కేసీఆర్ ను కలిసిన జీవన్ రెడ్డి

Caption of Image.
  • ఎర్రవల్లి ఫామ్​హౌస్​లో భేటీ 
  • ‘అన్నా.. మీతో కలిసి పనిచేయమని 
  • నన్ను దేవుడే పంపిండు’ అని కామెంట్​

జగిత్యాల/ సిద్దిపేట, వెలుగు:సీనియర్​ లీడర్, మాజీమంత్రి టి. జీవన్​రెడ్డి శుక్రవారం మాజీ సీఎం కేసీఆర్​ను ఎర్రవల్లి ఫామ్ హౌస్​లో కలిశారు. ఇటీవల కాంగ్రెస్​కు రాజీనామా చేసిన జీవన్​రెడ్డిని.. గురువారం బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ ​జగిత్యాలలో కలిసి తమ పార్టీలో చేరాలని కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్​ఆహ్వానం మేరకు జీవన్​రెడ్డి శుక్రవారం ఎర్రవల్లి ఫామ్​హౌస్​కు వచ్చారు. ఆయనకు కేటీఆర్​తో పాటు బీఆర్ఎస్​ లీడర్లు స్వాగతం పలికారు. 

ఈ సందర్భంగా కేసీఆర్​ను జీవన్​రెడ్డి కలిసి.. ‘ అన్నా.. మీతో కలిసి పనిచేయమని నన్ను దేవుడే పంపిండు’ అంటూ పేర్కొన్నారు. కేసీఆర్ కూడా జీవన్​రెడ్డిని ఆప్యాయంగా పలకరించి  ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత తాజా రాజకీయ పరిణామాలపై వారు చర్చించారు. ఈ సందర్భంగా పార్టీలో సముచిత స్థానం, గౌరవం కల్పిస్తానని జీవన్​రెడ్డికి కేసీఆర్ భరోసా ఇచ్చినట్టు తెలిసింది. మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్. రమణ, ఎమ్మెల్యే కె.సంజయ్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే కె. విద్యాసాగర్ రావు, పార్టీ నేతలు గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి తదితరులున్నారు. జీవన్ రెడ్డితోపాటు ఆయన కుమారులు, జగిత్యాల మాజీ జడ్పీ చైర్ పర్సన్ వసంత సురేశ్ దంపతులు కేసీఆర్​ను కలిశారు.  

జగిత్యాలలో బహిరంగ సభ 
ఏర్పాటు చేస్తం: జీవన్​ రెడ్డి

జగిత్యాలలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలనుకుంటున్నామని, మాజీ సీఎం కేసీఆర్ ను ఈ సభకు రావాలని కోరగా సానుకూలంగా స్పందించారని జీవన్​రెడ్డి చెప్పారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.  పదవుల కోసమే అయితే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే వెళ్లేవాడినని, కాంగ్రెస్  ప్రజలకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదని, ప్రజల పక్షాన పోరాడేందుకు బీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయం తీసుకున్నానని అన్నారు. ‘రేవంత్ రెడ్డి పోవాలి.. కేసీఆర్ రావాలి’ అని ప్రజలు కోరుకుంటున్నారని, రెండేండ్లలో 3 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, 17 వేల ఉద్యోగాలు ఇచ్చారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు పీసీసీ నడుస్తున్నదని, రేవంత్ రెడ్డి వల్ల అధిష్టానం కూడా ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయిందన్నారు. 
 

©️ VIL Media Pvt Ltd.