
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని ‘సెరెనా హోటల్’ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. సాధారణంగా లగ్జరీకి, రాజరికపు మర్యాదలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఈ హోటల్.. ప్రస్తుతం అమెరికా – ఇరాన్ మధ్య జరగనున్న అత్యంత కీలకమైన చర్చలకు వేదికవుతోంది. పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలను తగ్గించే లక్ష్యంతో ఇరు దేశాల ప్రతినిధులు ఇక్కడ భేటీ కానున్నారు. ఈ హై-ప్రొఫైల్ మీటింగ్ కోసం పాకిస్థాన్ ప్రభుత్వం ఏకంగా హోటల్‌ను తన అధీనంలోకి తీసుకుందంటేనే అర్థం చేసుకోవచ్చు.. అక్కడ సెక్యూరిటీ ఏ రేంజ్‌లో ఉందో. ఏప్రిల్ 8 సాయంత్రం నుంచే గెస్టులందరినీ రూమ్ ఖాళీ చేయాలని మేనేజ్‌మెంట్ ఆదేశించిందంటే.. ఇది మామూలు ఈవెంట్ కాదని స్పష్టమవుతోంది.
2002లో అప్పటి పాకిస్థాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ హోటల్.. పర్యాటక రంగంలో దిగ్గజమైన అగాఖాన్ ఫండ్ ఫర్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో నడుస్తోంది. 300కు పైగా గదులు, అత్యద్భుతమైన ఆర్కిటెక్చర్, గ్రాండ్ బాల్‌రూమ్‌లతో ఈ హోటల్ ఒక ప్యాలెస్‌ను తలపిస్తుంది. కేవలం అందం మాత్రమే కాదు.. అత్యంత గోప్యంగా చర్చలు జరుపుకోవడానికి అవసరమైన ప్రెసిడెన్షియల్ సూట్లు, ఎగ్జిక్యూటివ్ లాంజ్‌లు దీనిలో ప్రత్యేక ఆకర్షణ. ఇప్పుడు జరుగుతున్న అమెరికా-ఇరాన్ చర్చల కోసం ఈ హోటల్‌లోని సున్నితమైన మీటింగ్ స్పేస్‌లను ప్రత్యేకంగా సిద్ధం చేశారు.
►ALSO READ | మేం పాక్ను నమ్మం!..అమెరికా కూడా మధ్యవర్తిగానే చూస్తోంది: ఇజ్రాయెల్
ఇక హోటల్ స్టే రేట్ల విషయానికి వస్తే.. సెరెనా హోటల్ రేట్లు సామాన్యులకు చుక్కలు చూపిస్తాయి. ఇక్కడ ఒక డీలక్స్ రూమ్ రాత్రికి దాదాపు రూ.13వేల నుంచి ప్రారంభమవుతుంది. అదే ఎగ్జిక్యూటివ్ రూమ్స్ అయితే రూ.23వేలక వరకు పలుకుతాయి. ఇక అత్యంత విలాసవంతమైన ప్రెసిడెన్షియల్ సూట్ ధర సుమారు రూ.93వేలుగా ఉంటుంది. వినడానికి ఇది చాలా ఎక్కువగానే అనిపించినా.. మన దేశ రాజధాని ఢిల్లీలోని ఐకానిక్ ‘తాజ్ హోటల్’తో పోలిస్తే మాత్రం సెరెనా కొంచెం తక్కువనే చెప్పుకోవాలి.
ఢిల్లీ తాజ్ హోటల్‌లో డీలక్స్ రూమ్ ధర సుమారు రూ.11వేల 700 నుంచి రూ.14వేల మధ్య ఉంటుంది. కానీ అసలైన తేడా ఎక్కడ వస్తుందంటే.. తాజ్‌లోని ప్రెసిడెన్షియల్ సూట్ కింగ్ రూమ్ ధర అక్షరాలా 6 లక్షల రూపాయలకు పైమాటే. అంటే సెరెనా హోటల్ ప్రెసిడెన్షియల్ సూట్ కంటే తాజ్ సూట్ దాదాపు ఆరు రెట్లు ఖరీదైనది అన్నమాట. ఏది ఏమైనా.. ప్రస్తుతం ఇస్లామాబాద్ సెరెనా హోటల్ కేవలం ఒక విడిది కేంద్రం మాత్రమే కాదు, ప్రపంచ శాంతిని నిర్ణయించే ఒక వ్యూహాత్మక వేదికగా మారిపోయింది. అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు సఫలమైతే.. చరిత్రలో ఈ హోటల్ పేరు చిరస్థాయిగా నిలిచిపోవడం ఖాయం.