Reading Time: < 1 minute

వరుసగా మూడో క్వార్టర్ లోనూ వృద్ది.. టీసీఎస్ లాభం రూ.13వేల718 కోట్లు

Caption of Image.
  • ఆదాయం రూ.2.67 లక్షల కోట్లు
  • కొత్తగా 2,356 మంది ఉద్యోగులు
  • రూ.31 చొప్పున ఫైనల్ డివిడెండ్

న్యూఢిల్లీ:దేశంలోనే అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టీసీఎస్ 2026 ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్ ఫలితాలను ప్రకటించింది. మార్చి క్వార్టర్ లో కంపెనీ నికర లాభం 12.22 శాతం పెరిగి రూ.13,718 కోట్లుగా నమోదైంది.  గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ లాభం రూ.12,224 కోట్లుగా ఉండగా, అంతకుముందు డిసెంబర్ క్వార్టర్ లో రూ.10,657 కోట్లుగా ఉంది.  నిర్వహణ ఆదాయం కూడా 9.64 శాతం పెరిగి రూ.70,698 కోట్లకు చేరుకుంది. 

గతేడాది ఇదే సమయంలో ఆదాయం రూ.64,479 కోట్లుగా ఉంది. మొత్తం 2026 ఆర్థిక సంవత్సరానికి టీసీఎస్ ఆదాయం 4.58 శాతం పెరిగి రూ.2.67 లక్షల కోట్లకు చేరింది. ఈ ఏడాది కంపెనీ మొత్తం లాభం రూ.49,210 కోట్లుగా ఉంది.  ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 24.2 శాతం నుంచి 25.3 శాతానికి పెరిగింది. కంపెనీ ఈసారి 2, 356 మంది ఉద్యోగులను చేర్చుకుంది. దీంతో 2026 మార్చి నాటికి కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 5,84,519కి చేరింది. 

కంపెనీ నుంచి బయటకు వెళ్లే ఉద్యోగుల శాతం (అట్రిషన్) 13.7 శాతానికి తగ్గింది.  ఈ నెల నుంచి సంస్థ వ్యాప్తంగా జీతాల పెంపును అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. టీసీఎస్ ఎండీ కృతివాసన్ మాట్లాడుతూ వరుసగా మూడో క్వార్టర్ లోనూ వృద్ధిని సాధించామని చెప్పారు. ప్రధాన మార్కెట్లు, అన్ని రంగాల్లో కంపెనీ పనితీరు బాగుందని వివరించారు. ఈ క్వార్టర్ లో టీసీఎస్ 12 బిలియన్ డాలర్ల విలువైన కొత్త ఒప్పందాలను కుదుర్చుకుంది. కంపెనీ బోర్డు షేరుకు రూ.31 చొప్పున ఫైనల్ డివిడెండ్ ను ప్రతిపాదించింది.  

©️ VIL Media Pvt Ltd.