
Viral Video Controversy : టీమిండియా వెటరన్ లెగ్ స్పిన్నర్, పంజాబ్ కింగ్స్ స్టార్ ప్లేయర్ యుజ్వేంద్ర చాహల్ చుట్టూ ఇప్పుడు ఒక కొత్త వివాదం ముసురుకుంది. ఐపీఎల్ 2026 సీజన్ ఉత్కంఠగా సాగుతున్న వేళ, చాహల్ కారు నడుపుతూ సిగరెట్ తాగుతున్నట్లు ఉన్న ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో చాహల్ పోలికలతో ఉన్న ఒక వ్యక్తి కారులో పొగ తాగుతూ, ఆ సిగరెట్ ముక్కను రోడ్డుపై పారేయడం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ వీడియో నిజమైందా లేక మార్ఫింగ్ చేశారా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు.
శుక్రవారం రాత్రి నుంచి ఎక్స్ , ఇన్‌స్టాగ్రామ్ ప్లాట్‌ఫారమ్‌లలో ఒక వీడియో హల్‌చల్ చేస్తోంది. ఒక లగ్జరీ కారును డ్రైవ్ చేస్తున్న వ్యక్తి సిగరెట్ తాగి, ఆ తర్వాత ఆ ముక్కను కిటికీలోంచి రోడ్డుపైకి విసిరేశాడు. ఆ వ్యక్తి చూడటానికి అచ్చు చాహల్ లాగే ఉండటంతో నెటిజన్లు ఒక్కసారిగా విరుచుకుపడుతున్నారు. సెలబ్రిటీ హోదాలో ఉండి రోడ్డు మీద చెత్త వేయడం, బహిరంగంగా ధూమపానం చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయితే, ఇండియా టుడే సహా పలు మీడియా సంస్థలు ఈ వీడియో ప్రామాణికతను ఇంకా ధృవీకరించలేదు.
మొన్ననే మందు మానేశానన్నాడు.. మరి ఇప్పుడేంటి?
ఈ వివాదం రావడానికి కొద్దిరోజుల ముందే చాహల్ ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తన ఫిట్‌నెస్ కోసం, యువకులకు ఆదర్శంగా ఉండటం కోసం గత ఆరు నెలలుగా మద్యపానానికి పూర్తిగా దూరంగా ఉన్నానని ఏబీ డివిలియర్స్ యూట్యూబ్ ఛానెల్ లో చెప్పాడు. 35 ఏళ్ల వయసులో కూడా 150 శాతం కష్టపడాలనే లక్ష్యంతో ఉన్నానని ప్రకటించిన చాహల్, ఇలా సిగరెట్ తాగుతూ కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మాటలకు, చేతలకు పొంతన లేదని అభిమానులు విమర్శిస్తున్నారు.
Yuzvendra chahal
pic.twitter.com/CsD76TRIV0
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) April 10, 2026
పంజాబ్ కింగ్స్ మేనేజ్మెంట్ మౌనం
ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడేందుకు సిద్ధమవుతోంది. ఈ కీలక సమయంలో చాహల్ చుట్టూ ఇటువంటి వివాదం నెలకొనడం జట్టును ఒత్తిడిలోకి నెట్టే అవకాశం ఉంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు చాహల్ 3 మ్యాచ్‌ల్లో 3 వికెట్లు తీసి పర్వాలేదనిపిస్తున్నాడు. అయితే ఈ వీడియోపై అటు చాహల్ గానీ, ఇటు పంజాబ్ కింగ్స్ మేనేజ్మెంట్ గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. వీడియో పాతదా లేక ఇప్పుడు తీసిందా అనే విషయాలు తెలియాల్సి ఉంది.
బహిరంగ ప్రదేశాల్లో బాధ్యతారాహిత్యం
ఒక జాతీయ స్థాయి ఆటగాడు రోడ్డు మీద సిగరెట్ ముక్క వేయడం పౌర బాధ్యతారాహిత్యం కిందకు వస్తుందని పలు స్వచ్ఛంద సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఒకవేళ ఇది నిజమని తేలితే చాహల్ శిక్షార్హుడు అవుతాడని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఐపీఎల్ ఫైనల్ వరకు వెళ్లాలనే లక్ష్యంతో ఉన్న పంజాబ్ కింగ్స్ కు చాహల్ ఒక కీలక ఆటగాడు. మరి ఈ పొగ వివాదం అతని ఆటపై ఏమైనా ప్రభావం చూపుతుందో లేదో వేచి చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..