Reading Time: < 1 minute
Hyderbad: కౌన్సిలింగ్ కోసం రౌడీ షీటర్లు అందర్నీ పిలిచిన పోలీసులు.. ఆ తర్వాత షాకింగ్ ట్విస్ట్..

హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలను అదుపులో ఉంచడంతో పాటు డ్రగ్స్ రహిత నగరంగా మార్చేందుకు హైదరాబాద్ పోలీసులు సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. తాజాగా నగరవ్యాప్తంగా ఉన్న రౌడీ షీటర్లపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. కేవలం నేరాలు చేయడమే కాకుండా, వీరు మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు కీలక ఆపరేషన్ చేపట్టారు నగరవ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న సుమారు 1300 మంది రౌడీ షీటర్లను పోలీసులు గుర్తించారు. వీరి కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు, వారందరినీ ఒకే చోట చేర్చి కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు అనూహ్యంగా డ్రగ్ పరీక్షలు నిర్వహించారు.

షాకింగ్ రిపోర్ట్స్ 250 మందిలో 190 మందికి పాజిటివ్!

తొలి విడతగా పోలీసులు సుమారు 250 మంది రౌడీ షీటర్లకు డ్రగ్స్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల ఫలితాలు పోలీసులను సైతం విస్మయానికి గురిచేశాయి. 250 మందిలో ఏకంగా 190 మందికి డ్రగ్స్ పాజిటివ్ అని తేలింది. అంటే పరీక్షలు చేయించుకున్న వారిలో దాదాపు 75 శాతం మంది మత్తుకు బానిసలయ్యారని స్పష్టమైంది.

గంజాయి మత్తులో గ్యాంగ్‌స్టర్లు..

డ్రగ్స్ పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన వారిలో మెజారిటీ రౌడీ షీటర్లు గంజాయి  అలవాటు పడినట్లు పోలీసులు గుర్తించారు. గంజాయి మత్తులో వీరు విచక్షణ కోల్పోయి ఘర్షణలకు దిగడం, హత్యలు, దాడులు వంటి నేరాలకు పాల్పడుతున్నారని విచారణలో తేలింది.

ముఠా మూలాల కోసం వేట

రౌడీ షీటర్లకు ఇంత భారీ స్థాయిలో గంజాయి ఎక్కడి నుంచి సరఫరా అవుతోంది? దీని వెనుక ఉన్న ప్రధాన డ్రగ్ పెడ్లర్లు ఎవరు? అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నగర శివార్ల నుంచి సరఫరా అవుతోందా? పక్క రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకుంటున్నారా? వీరికి సహకరిస్తున్న స్థానిక ఏజెంట్లు ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానం రాబట్టేందుకు పోలీసులు రౌడీ షీటర్లను ముమ్మరంగా విచారిస్తున్నారు. నేరస్తులందరినీ డ్రగ్స్ నుండి దూరం చేయడమే కాకుండా, నగరంలో సప్లై చెయిన్ తెంచేయడమే లక్ష్యంగా పోలీసులు ఈ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నారు. రాబోయే రోజుల్లో మిగిలిన రౌడీ షీటర్లకు కూడా పరీక్షలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ పరిణామంతో నగరంలోని అసాంఘిక శక్తుల్లో వణుకు మొదలైంది.

Also Read: రోజుకు 12 లీటర్ల పాలిచ్చే ఆవులు.. నిర్వహణ సులభం.. ధర ఎంతంటే..