
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేస్తున్న విద్యుత్ శాఖ ఆర్టిజన్ కార్మికులపై ప్రభుత్వం బెదిరింపు ధోరణి ఆపాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. జెన్‌కో, ట్రాన్స్‌కో, ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ సంస్థల్లో పనిచేస్తున్న 18 వేల మందికి పైగా ఆర్టిజన్లు మూడు రోజులుగా సమ్మెలో ఉన్నారని పేర్కొన్నారు. చట్టబద్ధంగా నోటీసు ఇచ్చి సమ్మెకు వెళ్లిన కార్మికులపై ఎస్మా ప్రయోగించడం, డిస్మిస్ చేస్తామని హెచ్చరించడం, మెమోలు జారీ చేయడం సరికాదన్నారు.
వారిని భయపెట్టడం కాకుండా చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. గత ప్రభుత్వం ఆర్టిజన్ పేరుతో కార్మికులను శ్రమదోపిడీకి గురిచేసిందని, పదేళ్లుగా సరైన వేతనాలు, ప్రమోషన్లు లేక అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో విద్యుత్ డిమాండ్ అధికంగా ఉండటంతో, సమ్మె ప్రభావం ప్రజలపై పడే అవకాశం ఉందని హెచ్చరించారు.