
కొత్తగా కారు, బైక్ కొనేటప్పుడు మన దృష్టి అంతా దాని మోడల్, కలర్, మైలేజ్, డెలివరీ డేట్ మీదనే ఉంటుంది. ఆ హడావిడిలో మనం చేసే అతిపెద్ద తప్పు ఇన్సూరెన్స్ ను ఒక ఫార్మాలిటీగా చూడటమే. అవును షోరూమ్ డీలర్లు ఇచ్చే కొటేషన్‌లో ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా కలిసి ఉంటుంది. మనం దానిని గుడ్డిగా నమ్మేసి సంతకం పెట్టేస్తాం. కానీ అక్కడే అసలు కథ మొదలవుతుంది. కార్ డీలర్ల దగ్గర ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఎక్కువ డబ్బు చెల్లించడమే కాక.. రేపు క్లెయిమ్ సమయంలో మోసపోయే ప్రమాదం కూడా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
డీలర్ల మాయాజాలం..
షోరూమ్ డీలర్లు తమ దగ్గరే ఇన్సూరెన్స్ తీసుకోవాలని కస్టమర్లపై ఒత్తిడి తెస్తుంటారు. ఒకవేళ బయట తీసుకుంటే ‘క్లెయిమ్ సెటిల్‌మెంట్’లో ఇబ్బందులు వస్తాయని లేదా వారెంటీ వర్తించదని భయపెడుతుంటారు. కానీ ఇది ముమ్మాటికీ అబద్ధం. డీలర్లకు ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి భారీగా కమీషన్లు వస్తాయి. అందుకే వారు దీనిని ఒక ప్యాకేజీలా అమ్ముతారు. ఉదాహరణకు బయట మార్కెట్‌లో రూ.30 వేలకు లభించే పాలసీని, డీలర్లు అదనపు యాక్సెసరీల పేరుతో రూ.45 వేలకు అంటగట్టవచ్చు. అంటే దాదాపు రూ. 10 నుంచి 15 వేలు కస్టమర్లు అదనంగా చెల్లిస్తున్నారన్నమాట.
తక్కువ ప్రీమియం చూపిస్తూ ఐడీవీలో కోత..
చాలా మంది కస్టమర్లు ప్రీమియం తక్కువగా ఉంటే ఆ పాలసీ మంచిదని భావిస్తారు. దీన్నే డీలర్లు ఆసరాగా చేసుకుంటారు. పాలసీ ధరను తగ్గించి చూపించడానికి వారు ‘ఐడీవీ’ (Insured Declared Value) ని తగ్గిస్తారు. ఐడీవీ అంటే మీ వాహనం ఒకవేళ దొంగతనానికి గురైనా లేదా పూర్తిగా ధ్వంసమైనా ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లించే గరిష్ట మొత్తం. ఉదాహరణకు రూ.10 లక్షల కారుకు ఐడీవీని రూ. 8 లక్షలకు తగ్గిస్తే మీరు చెల్లించాల్సిన ప్రీమియం తగ్గుతుంది. కానీ ఏదైనా ప్రమాదం జరిగితే మీరు రూ.2 లక్షల వరకు నష్టపోవాల్సి వస్తుంది. అలాగే వాలంటరీ డిడక్టబుల్స్ పెంచడం ద్వారా కూడా మిమ్మల్ని బురిడీ కొట్టిస్తారు డీలర్లు.
ALSO READ : 2026లో వోక్స్‌వ్యాగన్ నుంచి వస్తున్న టాప్-19 కార్ మోడళ్లు ఇవే..
నో క్లెయిమ్ బోనస్..
మీకు పాత వాహనం ఉండి. దానిపై గతంలో ఎలాంటి క్లెయిమ్ చేసుకోకపోతే.. మీకు నో క్లెయిమ్ బోనస్ కూడా వర్తిస్తుంది. దీనివల్ల కొత్త కారు ఇన్సూరెన్స్ ప్రీమియంపై 20% నుంచి 50% వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ విషయం డీలర్లు మీకు అస్సలు చెప్పరు. ఎందుకంటే ఆ డిస్కౌంట్ ఇస్తే వారి కమీషన్ తగ్గుతుంది. ఫలితంగా మీరు రావాల్సిన భారీ తగ్గింపును కోల్పోయి, అనవసరంగా ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. మీ పాత ఎన్‌సీబీని కొత్త వాహనానికి బదిలీ చేసుకోవచ్చనే విషయం గుర్తుంచుకుంటే డబ్బు ఆదా అవుతుంది.
క్లెయిమ్ సమయంలో తలపోటు..
చాలా సార్లు డీలర్లు ఇచ్చే బేసిక్ పాలసీల్లో ఇంజిన్ ప్రొటెక్షన్, కన్జ్యూమబుల్స్ కవర్ వంటి కీలకమైన యాడ్-ఆన్స్ ఉండవు. వర్షాకాలంలో నీరు చేరి ఇంజిన్ పాడైతే, ఈ కవర్ లేకపోతే లక్షల రూపాయలు మీ జేబు నుంచే ఖర్చు చేయాల్సి ఉంటుంది. డీలర్ వద్ద ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు వారు కేవలం ధర గురించి మాట్లాడతారు తప్ప.. ఏమేం కవర్ అవుతున్నాయో స్పష్టంగా చెప్పరు. అందుకే వాహనం డెలివరీ తీసుకునే ముందు వివిధ ఇన్సూరెన్స్ వెబ్‌సైట్లలో పాలసీల రేట్లు, ఫీచర్లను పోల్చి చూసుకోవడం చాలా అవసరం. మోటార్ వాహన చట్టం ప్రకారం ఇన్సూరెన్స్ తప్పనిసరి. అయితే దాన్ని వెహికల్ అమ్మే డీలర్ వద్దే తీసుకోవాలనే రూల్ మాత్రం ఎక్కడా లేదు. సో మీ కష్టార్జితాన్ని తెలివిగా కాపాడుకోండి.