
పంజాగుట్ట/మెహిదీపట్నం/వికారాబాద్, వెలుగు: విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె రెండో రోజుకు చేరింది. గురువారం మింట్ కాంపౌండ్, మెహిదీపట్నం, ఓల్డ్ సిటీ, వికారాబాద్లో కార్మికులు భారీ ఎత్తున ధర్నాలు, వంటా-వార్పు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టిజన్ జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులందరికీ ఒకే రకమైన సర్వీస్ రూల్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
గత ప్రభుత్వం 23,660 మందిని క్రమబద్ధీకరించామని అబద్ధాలు చెప్పిందని, ప్రస్తుతం అధికారంలో ఉన్న సీఎం రేవంత్రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. రెగ్యులర్ ఉద్యోగులకు ఇచ్చినట్లుగానే తమకు కూడా తెలంగాణ ఇంక్రిమెంట్, 24 గంటల ఇంక్రిమెంట్ వర్తింపజేయాలని, 2026 పీఆర్సీని అమలు చేయాలని పట్టుబట్టారు. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని కార్మికులు స్పష్టం చేశారు. ఈ నిరసనల్లో జేఏసీ నాయకులు శ్రీనివాస్, మహేశ్, బుచ్చిరెడ్డి, ఫైజుల్లా ఖాన్, అక్బర్ తదితరులు పాల్గొన్నారు.