Reading Time: 2 minutes

 సుప్రీంకోర్టు తీవ్ర హెచ్చరిక

శబరిమలలో మహిళలకు నిషేధంపై దాఖలైన

కేసులో కీలక వ్యాఖ్యలు 

న్యూఢిల్లీ: ప్రతి ఒక్కరికీ అన్ని దేవాలయా లు, మఠాల్లో ప్రవేశం ఉండాలని, ఏదైనా వ ర్గాన్ని లేదా పంథాను వెలివేయడం హిందూమతంపై ప్రతికూల ప్రభావం చూపడంతో పాటు సమాజాన్ని విభజిస్తుందని గురువారం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మహిళలపై మతపరమైన స్థలాల్లో వివక్షకు సంబంధించిన పిటిషన్లపై విచారణ సందర్భంగా తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ బెంచ్ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇందులో సూర్యకాంత్ ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించగా, న్యాయమూర్తులు బి.వి.నాగరత్న, ఎం.ఎం.సుందరేశ్, అహ్సానుద్దీన్ అమానుల్లా, అరవింద్ కుమార్, ఆగస్టిన్ జార్జ్ మసీహ్, ప్రసన్న బి.వరాలే, ఆర్.మహాదేవన్, జోయ్మాల్య బాగ్చి సభ్యులుగా ఉన్నారు.

శబరిమల కేసు నేపథ్యం

కేరళలోని శబరిమల ఆలయం సహా వివిధ మతస్థలాల్లో మహిళల ప్రవేశంపై ఉన్న ఆంక్షలు, మత స్వేచ్ఛ పరిమితులపై ఈ విచారణ కొనసాగుతోంది. విచారణలో భాగంగా సీనియర్ న్యాయవాది సి.ఎస్. వైద్యనాథన్, నాయర్ సర్వీస్ సొసైటీ, అయ్యప్ప సేవా సమాజం వంటి సంస్థల తరఫున వాదిస్తూ, ఒక నిర్దిష్ట పంథానికి చెందిన దేవాలయాలు తమ వర్గానికే పరిమితమయ్యే హక్కు ఉందని వాదించారు. అయితే న్యాయమూర్తి నాగరత్న స్పందిస్తూ, ప్రవేశ హక్కు విషయంలో ఒక వర్గాన్ని మాత్రమే అనుమతించడం హిందూమతానికి నష్టం కలిగిస్తుంది అని వ్యాఖ్యానించారు.

ప్రతి ఒక్కరికీ దేవాలయాలు, మఠాల్లో ప్రవేశం ఉండాలి. ఇతరులను నిరాకరించడం మతానికి మంచిది కాదు అని స్పష్టం చేశారు. న్యాయమూర్తి అరవింద్ కుమార్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, ఇలాంటి విధానాలు సమాజాన్ని విభజిస్తాయని హెచ్చరించారు. “మన దేశంలో పురుషులకు ప్రవేశం లేని ఆలయాలు కూడా ఉన్నాయి. దేవి భగవతి ఆలయంలో కొన్నేళ్లుగా ఇలాంటి ఆచారం కొనసాగుతోంది. ఇక కేరళలో ఓ ఆలయంలోకి అబ్బాయిలు మహిళల వేషధారణలో వెళ్తారు. అందుకోసం వారు బ్యూటీపార్లర్‌కు వెళ్లి మరీ అమ్మాయిల్లా తయారవుతాయి. కాబట్టి ఇది పురుషాధిక్య లేదా స్త్రీ ఆధిక్య మత విశ్వాసాలకు సంబంధించిన ప్రశ్న కాదు అని తుషార్ మెహతా పేర్కొన్నారు.

న్యాయపరమైన అంశాలు

దేవాలయాలు కేవలం తమ వర్గానికే సేవలు అందిస్తే, ప్రభుత్వం లేదా ప్రజల నుండి నిధులు స్వీకరించకూడదని వాదనలు వినిపించాయి. అలాగే ఏ చట్టమైనా ప్రజా శాంతి, నైతికత, ఆరోగ్య ప్రమాణాలను పాటించాల్సిందేనని న్యాయవాదులు పేర్కొన్నారు. గతంలో దేవరు కేసులో సుప్రీంకోర్టు మద్రాస్ ఆలయ ప్రవేశ చట్టాన్ని సమర్థిస్తూ, అన్ని హిందువులకు దేవాలయ ప్రవేశం అనుమతించాలనే విషయాన్ని స్పష్టం చేసింది. అయితే కొన్ని ప్రత్యేక ఆచారాలను మాత్రం నిర్దిష్ట వర్గాలకు పరిమితం చేయవచ్చని పేర్కొంది.

విసృ్తత విచారణ కొనసాగుతోంది

మత స్వేచ్ఛ పరిధిపై ఏడు కీలక ప్రశ్నలను ఈ రాజ్యాంగ బెంచ్ రూపొందించింది. 2018లో ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. అనంతరం 2019లో ఈ అంశాన్ని మరింత విసృ్తతంగా పరిశీలించేందుకు ఉన్నత బెంచ్‌కు బదిలీ చేశారు. ఈ కేసు తీర్పు మత స్వేచ్ఛ, లింగ సమానత్వం, సామాజిక సమగ్రతపై దేశవ్యాప్తంగా ప్రభావం చూపే అవకాశముందని న్యాయవర్గాలు భావిస్తున్నాయి.