Reading Time: 3 minutes

సమాజంలో మార్పు రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ఆ మార్పు కోసం ముందుకు వచ్చి పోరాడే ధైర్యవంతులు మాత్రం అరుదుగా ఉంటారు. అన్యాయం చూసి మౌనంగా ఉండటం సులభం. దానికి ఎదురు నిలబడటం నిజమైన ధైర్యం. అలాంటి ధైర్యంతో అణగారిన వర్గాల కోసం, మహిళల హక్కుల కోసం, సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే. ఆయన జీవితం కేవలం చరిత్రలోని ఒక అధ్యాయం మాత్రమే కాదు. అది కోట్లాది మందికి ప్రేరణగా నిలిచిన జీవగాథ. ఆయన జయంతి ఒక తేదీ మాత్రమే కాదు. మన మనస్సాక్షిని మేల్కొలిపే, మన బాధ్యతలను గుర్తుచేసే చైతన్య దినం. ఫూలే జన్మించిన కాలంలో భారతీయ సమాజం కులవివక్షతో కట్టుబడి, అసమానతలు, అన్యాయాలతో నిండిపోయి ఉండేది. పుట్టుక ఆధారంగా మనిషి విలువను నిర్ణయించడం, విద్యను కొద్దిమంది వర్గాలకే పరిమితం చేయడం, మహిళలను, అణగారిన వర్గాలను అజ్ఞానంలో ఉంచడం వంటి సమస్యలు విస్తృతంగా ఉన్నాయి.

కానీ ఈ అన్యాయాలను ఫూలే ధైర్యంగా ప్రశ్నించారు. మనిషి విలువ పుట్టుకతో కాదు, గుణాలతో నిర్ణయించబడుతుంది, విద్య అందరికీ హక్కు అనే భావాలతో ఆయన సమాజాన్ని సవాలు చేశారు. 1827 ఏప్రిల్ 11న మహారాష్ట్రలోని పుణెలో ఒక సాధారణ మాలీ కుటుంబంలో ఫూలే జన్మించారు. చిన్నప్పుడే తల్లి మరణం ఆయన జీవితాన్ని కష్టాల దారిలో నడిపించింది. తండ్రి గోవిందరావు కష్టపడి కుటుంబాన్ని పోషిస్తూ, పిల్లలకు జీవన విలువలను నేర్పించారు. పేదరికం, కష్టాలు, సామాజిక అవమానాలు ఆయన బాల్యం లో భాగమయ్యాయి. అయినప్పటికీ అవి ఆయనను బలహీనుడిగా మార్చలేదు. మరింత దృఢసంకల్పంతో ముందుకు నడిపించాయి. చదువుపట్ల ఆసక్తి ఉన్నప్పటికీ కులవివక్ష కారణంగా ఆయన విద్య మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. కానీ తరువాత ఒక స్కాటిష్ మిషనరీ పాఠశాలలో చదివే అవకాశం దొరికింది.

అక్కడ పొందిన పాశ్చాత్య విద్య ఆయనలో విమర్శనాత్మక దృష్టిని పెంచి, సమానత్వం, మానవత్వంపట్ల ఆకర్షణ కలిగించింది. అమెరికన్ తత్వవేత్త థామస్ పెయిన్ రచించిన రైట్స్ ఆఫ్ మాన్ గ్రంథం ఆయన ఆలోచనలపై గాఢమైన ప్రభావం చూపింది. అలాగే ఫ్రెంచ్, అమెరికా విప్లవాలు ఆయనను ప్రభావితం చేశాయి. వీటితోపాటు ఆయనకు ఎదురైనా అనుభవాలు, వ్యక్తులు, సంఘటనలు ఆయనను సమాజ మార్పు కోసం పోరాడే మహానేతగా తీర్చిదిద్దాయి. ఫూలే జీవితాన్ని మలిచిన ఒక సంఘటన ఎంతో ప్రసిద్ధి చెందింది. ఒక బ్రాహ్మణ స్నేహితుడి పెండ్లి ఊరేగింపులో పాల్గొనప్పుడు, కులం పేరుతో ఆయనను అవమానించారు. నీవు ఈ పెండ్లి ఊరేగింపులో పాల్గొనుటకు అర్హుడు కాదు అనే మాటలు ఆయన హృదయంలో చెరిగిపోని గాయాన్ని మిగిల్చాయి. ఆ అవమానం ఆయనను వెనక్కి తగ్గించలేదు.

అది ఆయనలో తిరుగుబాటుకు నాంది పలికింది. మనిషిని కులం ద్వారా ఎందుకు కొలుస్తారు? ఒక కులం గొప్పది, మరొకటి తక్కువది ఎందుకు? అనే ప్రశ్నలు ఆయనలో ఆలోచనల జ్వాలగామారి, సమాజ మార్పుకు మార్గం చూపాయి. మహాత్మా జ్యోతిరావు ఫూలే విద్య ద్వారానే సమాజాన్ని మార్చడం సాధ్యమని, విద్యనే అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుందని బలంగా విశ్వసించారు. అందుకే తొలుత అణగారిన వర్గాలకు, మహిళలకు విద్య అందించడమే ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మార్గంలో ఆయనకు అండగా నిలిచింది ఆయన జీవిత భాగస్వామి సావిత్రిబాయి ఫూలే. సావిత్రిబాయి ఫూలే భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయిగా నిలిచారు. ఫూలే ఆమెను విద్యాబోధనకు సిద్ధం చేసి, ఇద్దరూ కలిసి 1848లో బాలికల కోసం మొదటి పాఠశాలను ప్రారంభించారు. ఆ కాలంలో ఇది విప్లవాత్మక చర్య.

అది కేవలం ఒక విద్యాసంస్థ కాదు, అది సమాజ విముక్తి కోసం మొదటి అడుగు. మహిళలు చదువుకుంటే కుటుంబం ఎదుగుతుంది, సమాజం అభివృద్ధి చెందుతుంది అనే గొప్ప సందేశాన్ని ఆయన అందించారు. సమాజం నుండి తీవ్రమైన వ్యతిరేకత, అవమానాలు ఎదురైనా వారు వెనక్కి తగ్గలేదు. అనేక బాలబాలికల పాఠశాలలు స్థాపించిన అణగారిన వర్గాల పిల్లలు విద్య వ్యాప్తికి కృషి చేశారు. ఫూలే కేవలం విద్య సేవకే పరిమితం కాలేదు. సమాజం నిర్లక్ష్యం చేసిన వర్గాలకు ఆయన ఒక ఆశాకిరణం అయ్యారు. 1873 లో సత్యశోధక సమాజంను స్థాపించి, సమాజంలో సమానత్వం కోసం పోరాటం చేశారు. ఈ సంస్థ ద్వారా కులవివక్ష నిర్మూలన, మహిళా హక్కులు, వితంతువుల పునర్వివాహం, శిశుహత్యల నివారణ వంటి అనేక సామాజిక సమస్యలపై ఆయన పోరాటం కొనసాగించారు. వితంతు స్త్రీల కోసం, అనాథ శిశువుల కోసం శరణాలయాలు నిర్మించి వారిని ఆదరించారు. వితంతు స్త్రీకి పుట్టిన బిడ్డకు యశ్వంత్ రావు అని పేరుపెట్టి దత్తత తీసుకున్నారు.

రైతుల, కార్మికుల సమస్యలపై కూడా ఆయన చేసిన పోరాటం ఆయనను నిజమైన ప్రజానాయకుడిగా నిలబెట్టింది. విద్యతోనే విముక్తి, సమానత్వంతోనే సమాజ అభివృద్ధి సాధ్యమని విశ్వసించిన మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆశయాలు నేటికీ పూర్తిగా సాకారం కాలేదు. సాంకేతికంగా దేశం ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ, కులం, లింగం, ఆర్థిక స్థితి ఆధారంగా భేదాలు ఇంకా అనేక ప్రాంతాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. విద్య అందరికీ హక్కు అని చెప్పే దేశంలో, ఆ హక్కు ప్రతి ఒక్కరికీ సమానంగా అందుతోందా? సమాన అవకాశాలు నిజంగా అమలవుతున్నాయా? మనం ఆయన చూపిన మార్గంలో నడుస్తున్నామా? అనే ప్రశ్నలకు సమాధానం మనలోనే వెతకాలి. ఫూలే జయంతి సందర్భంగా కేవలం పూలమాలలు వేసి, ప్రసంగాలు చేయడం మాత్రమే సరిపోదు. ఆయన ఆలోచనలను మన జీవన విధానంలో ఆచరణలోకి తీసుకురావడమే నిజమైన నివాళి. మనం చదివి ఎదగడమే కాకుండా, ఇతరులను కూడా విద్యతో ముందుకు నడిపించడం మన సామాజిక బాధ్యతగా భావించాలి. సమానత్వం, న్యాయం, విద్య అనే విలువలపై నిలిచిన సమాజం నిజమైన అభివృద్ధిని సాధిస్తుంది. అదే పూలే గారికి ఇచ్చే గొప్ప నివాళి.

– నేడు జ్యోతిరావు ఫూలే జయంతి