
- ధాన్యం సేకరణ టార్గెట్లు పెంచాలని కేంద్రానికి వినతి
- స్పందిచాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి మంత్రి లేఖ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ధాన్యం సేకరణ భారీగా పెరిగిన నేపథ్యంలో రైతులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి మరోసారి విన్నవించింది. గురువారం సివిల్ సప్లైస్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి లెటర్ రాశారు. గత యాసంగి కస్టమ్ మిల్డ్ రైస్(సీఎంఆర్) గడువు పెంచాలనీ, ఈ సంవత్సరం రెండు సీజన్లలో బాయిల్డ్ రైస్ టార్గెట్ పెంచాలని కీలక అంశాలపై తక్షణం అనుమతులు ఇవ్వాలని ఉత్తమ్ కోరారు.
కేంద్రం సీఎంఆర్ టార్గెట్ లు, బాయిల్డ్ రైస్ టార్గెట్లు తగ్గిస్తున్నందున అదనపు ధాన్యం నిర్వహణ కష్టంగా మారుతోందని తెలిపారు. రాష్ట్రం డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్‌మెంట్ స్కీమ్ కింద ధాన్యం సేకరణ చేస్తూ రైతులకు మద్దతు ధర అందిస్తున్నదనీ, బ్యాంకు లోన్లపై భారీ వడ్డీ చెల్లిస్తోందని మంత్రి లెటర్లో స్పష్టం చేశారు.
కేంద్ర సహకారం లేకుండా ఈ భారం దీర్ఘకాలం మోయడం కష్టమని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని డిమాండ్లపై అనుకూలంగా స్పందించాలని కేంద్రాన్ని మంత్రి కోరారు. గత రెండేళ్లుగా రైతు అనుకూల విధానాల వల్ల ధాన్యం ఉత్పత్తి గణనీయంగా పెరిగినప్పటికీ, కేంద్రం సీఎంఆర్, బాయిల్డ్ రైస్ లక్ష్యాలను తగ్గించడంతో రాష్ట్రంపై నిల్వలు, వ్యయభారం పెరుగుతోందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.
గతేడాది యాసంగి సీఎంఆర్ గడువు పొడిగించాలి..
గత యేడాది యాసంగి (2024–25 )కి సంబంధించి 5 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ టార్గెట్ కేటాయించాలన్నారు. ప్రస్తుతం ఎఫ్‌సీఐ రా రైస్ టార్గెట్‌ను తగ్గించి బాయిల్డ్ రైస్ టార్గెట్ ఇవ్వాలని మంత్రి ఉత్తమ్ కోరారు. గతేడాది యాసంగికి సంబంధించి ఇంకా 8.45 లక్షల టన్నుల రైస్ ఎఫ్‌సీఐకి ఫిబ్రవరి 28 వరకే డెలివరీ చేయాల్సి ఉందననీ, ఇప్పటికే డెలివరీ గడువు ముగిసిన నేపథ్యంలో మరో 60 రోజులు గడువు పొడిగించాలని కోరారు.
యాసంగి ధాన్యం బాయిల్డ్ రైస్ మిల్లింగ్‌కు అనువైనదని, రైస్ మిల్లర్ల సంఘంతో జరిపిన సమావేశంలో 5 శాతం నూకలతో బాయిల్డ్ రైస్ డెలివరీ చేయడానికి వారు సంసిద్ధత వ్యక్తం చేశారని మంత్రి తెలిపారు. కేంద్రం రా రైస్‌కు 10 శాతం నూకలతో అనుమతించినట్లుగానే బాయిల్డ్ రైస్‌కు 5 శాతం నూకలతో 5 లక్షల టన్నుల టార్గెట్ కేటాయించాలని కోరారు.
టార్గెట్ 40 లక్షల టన్నులకు పెంచాలి..
అదే విధంగా గత వానాకాలం, ఈయాసంగి(2025–26) రెండు సీజన్లలో కలిపి బాయిల్డ్ రైస్ టార్గెట్ 20 నుంచి 40 లక్షల టన్నులకు పెంచాలని మంత్రి ఉత్తమ్ కోరారు. గత వానాకాలంలో 71.86 లక్షల టన్నుల ధాన్యం సేకరించామనీ, ఈయాసంగిలో భారీగా వరి సాగు జరిగిన నేపథ్యంలో 95 లక్షల టన్నుల ధాన్యం కొనగోలు సెంటర్లకు వస్తుందని అంచనా వేసినట్లు తెలిపారు. యాసంగి ధాన్యం బాయిల్డ్ రైస్‌కు ఎక్కువగా అనుకూలమైనవని అన్నారు. గత ఆరు యాసంగి సీజన్లలో బాయిల్డ్ రైస్ డెలివరీ శాతం ఎక్కువగా ఉందని మంత్రి ఉత్తమ్ తెలిపారు.
వరుసగా 2019–20 యాసంగిలో 92.50 శాతం, 2020–21 యాసంగిలో 77.24 శాతం, 2021–22 యాసంగిలో 60.74 శాతం, – 2022–23 యాసంగిలో 77.19 శాతం, 2023–24 యాసంగిలో 78.77శాతం, 2024–25 యాసంగిలో 66.78 శాతం (ఇప్పటివరకు) ఉందని వివరించారు. ఈ నేపథ్యంలో యాసంగిలో బాయిల్డ్ రైస్టార్గెట్ పెంచాలని కోరారు. తక్షణమే కేంద్రం సానుకూలంగా స్పందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ లెటర్లో కోరింది.