Reading Time: 3 minutes

ఎన్నికల కాలం దగ్గర పడుతుండగానే దేశవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన చర్చ మొదలవుతుంది. ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అసోం, కేరళ రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వివిధ సర్వే సంస్థలు వరుసగా తమ అంచనాలను విడుదల చేస్తున్నాయి. ముఖ్యంగా సి-ఓటర్ వంటి సంస్థలు ప్రకటించిన తాజా ఒపీనియన్ పోల్స్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. అయితే, ఈ సర్వేలు ఎంతవరకు నిజాన్ని ప్రతిబింబిస్తాయి? వాటి శాస్త్రీయత ఎంత? ప్రజాస్వామ్యంలో వాటి పాత్ర ఏమిటి? అనే ప్రశ్నలు సహజంగానే ఎదురవుతున్నాయి. శాస్త్రీయత వెనుక ఉన్న పరిమితులు సర్వేలు సాధారణంగా శాస్త్రీయ పద్ధతుల ఆధారంగా నిర్వహిస్తామని చెప్పడం జరుగుతుంది. కొంతమంది ఓటర్లను నమూనాగా ఎంపిక చేసి, వారి అభిప్రాయాలను సేకరించి మొత్తం ఓటర్ల మూడ్‌ను అంచనా వేయడానికి ప్రయత్నిస్తారు. వయస్సు, లింగం, ప్రాంతం, సామాజిక వర్గాల ప్రాతినిధ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.

అయితే ఈ ప్రక్రియలోనే కొన్ని పరిమితులు ఉంటాయి. లక్షలాది ఓటర్ల అభిప్రాయాన్ని కొన్ని వేల మందిపై ఆధారపడి అంచనా వేయడం సహజంగానే పూర్తి సత్యాన్ని అందించలేకపోవచ్చు.ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, అట్టడుగు వర్గాల్లో అభిప్రాయ సేకరణ పూర్తిగా జరిగిందా అనే సందేహాలు తరచుగా వ్యక్తమవుతుంటాయి. సర్వే ఫలితాలు సూచిస్తున్న రాజకీయ దిశ ఇటీవల విడుదలైన సర్వేలు చూస్తే రాష్ట్రాలవారీగా పోటీ భిన్నంగా కనిపిస్తోంది. తమిళనాడులో అధికార పార్టీ, ప్రతిపక్ష కూటముల మధ్య తేడా చాలా తక్కువగా ఉండటం హోరాహోరీ పోటీని సూచిస్తోంది. పశ్చిమబెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్, బిజెపి మధ్య పోటీ దగ్గరగా ఉండటం చివరి క్షణంలో మార్పులకు అవకాశం ఉన్నట్టు చెబుతోంది. అసోంలో అధికార బిజెపి కూటమి స్పష్టమైన ఆధిక్యంలో ఉందని సర్వేలు సూచిస్తుండగా, కేరళలో సంప్రదాయంగా కొనసాగుతున్న అధికార మార్పిడి ధోరణి ఈసారి కూడా పునరావృతం కావచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. ఈ అంచనాలు రాజకీయ దిశను సూచించినప్పటికీ, తుది ఫలితాలను ఖచ్చితంగా నిర్ధారించలేవు.

ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసే శక్తి ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం గమనించాలి. ఈ సర్వేలు కేవలం ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించడమే కాకుండా, కొన్ని సార్లు ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం కూడా చేస్తాయి. ముందంజలో ఉన్న పార్టీకి మరింత మద్దతు లభించే బ్యాండ్ వ్యాగన్ ప్రభావం ఒకవైపు ఉండగా, వెనుకబడిన పార్టీలకు సానుభూతి పెరిగే అవకాశం మరోవైపు ఉంటుంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు సర్వేలను తమ ప్రచార వ్యూహాల్లో భాగంగా వినియోగించుకోవడం కూడా సాధారణమైంది. భారత ఎన్నికల చరిత్రలో సర్వేలు తప్పిపోయిన సందర్భాలు కూడా కొదవలేదు. అనూహ్యమైన ఫలితాలు, చివరి దశలో ఓటర్ల అభిప్రాయ మార్పులు, స్థానిక అంశాల ప్రభావం, అభ్యర్థుల వ్యక్తిగత ప్రభావం ఇవన్నీ కలిసి సర్వే అంచనాలను తప్పుదోవ పట్టించిన ఉదాహరణలు ఉన్నాయి. ఉదాహరణకు, 2004 సాధారణ ఎన్నికల్లో ఎక్కువ భాగం ఒపీనియన్ పోల్స్ ఇండియా షైనింగ్ ప్రచారంతో ఎన్‌డిఎ కూటమి మళ్లీ అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి.

కానీ తుది ఫలితాల్లో యుపిఎ కూటమి విజయం సాధించడం సర్వేల విశ్వసనీయతపై పెద్ద చర్చకు దారితీసింది. అలాగే 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అనేక సర్వేలు త్రిభుజ పోటీని సూచించినప్పటికీ, ఆమ్‌ఆద్మీ పార్టీ భారీ మెజారిటీతో గెలవడం అంచనాలను పూర్తిగా తారుమారు చేసింది. ఇక 2020 బీహార్ ఎన్నికల్లో కూడా ఎగ్జిట్ పోల్స్ ఎక్కువగా మహాగఠ్‌బంధన్‌కు అనుకూలంగా సూచించినా, తుది ఫలితాల్లో ఎన్‌డిఎ కూటమి తిరిగి అధికారంలోకి రావడం మరోసారి సర్వేల పరిమితులను బయటపెట్టింది. పశ్చిమబెంగాల్ 2021 ఎన్నికల్లో కూడా కొన్ని ఎగ్జిట్ పోల్స్ హంగ్ అసెంబ్లీ లేదా బిజెపికి గట్టి పోటీ సూచించినప్పటికీ, తృణమూల్ కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యంతో గెలవడం అంచనాలను మించిపోయింది. ఈ ఉదాహరణలు ఒక విషయం స్పష్టంగా చెబుతున్నాయి. సర్వేలు ఓటర్ల తుది నిర్ణయాన్ని పూర్తిగా అంచనా వేయలేవు. ముఖ్యంగా సైలెంట్ ఓటర్ అనే వర్గం సర్వేలలో కనిపించకపోయినా, ఫలితాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. ఎన్నికల రోజు ఓటర్ల టర్నౌట్ కూడా ఫలితాన్ని పూర్తిగా మార్చగలదు.

అంతేకాకుండా, సర్వే సంస్థల స్వతంత్రత, పారదర్శకత కూడా ప్రశ్నార్థకంగా మారుతున్న సందర్భాలు ఉన్నాయి. సర్వేలకు ఎవరు నిధులు సమకూరుస్తున్నారు? డేటా సేకరణ ఎలా జరుగుతోంది? విశ్లేషణలో ఎలాంటి పద్ధతులు అనుసరించారు? వంటి ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు లేనప్పుడు వాటి విశ్వసనీయతపై సందేహాలు కలగడం సహజం. సర్వేలను ఎలా చూడాలి? ఈ పరిస్థితుల్లో సర్వేలను ఎలా చూడాలి? అవి పూర్తిగా నిరాకరించాల్సినవేనా? లేక పూర్తిగా నమ్మాల్సినవేనా? అనే ప్రశ్నకు సమతుల్యమైన సమాధానం అవసరం. సర్వేలు ఒక సూచికగా ఉపయోగపడతాయి. అవి ప్రజల ప్రస్తుత మూడ్‌ను అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి. కానీ అవి ఎన్నికల ఫలితాలపై తుది తీర్పు ఇవ్వలేవు. ఓటరు ప్రవర్తన చాలా సంక్లిష్టమైనది. చివరి క్షణంలో తీసుకునే నిర్ణయాలు, స్థానిక సమస్యలు, నాయకత్వంపై అభిప్రాయాలు ఇవన్నీ కలిసి ఓటు రూపంలో బయటపడతాయి.

తీర్పు ఎప్పటికీ ప్రజలదే.. మొత్తానికి, ఎన్నికల సర్వేలు ప్రజాస్వామ్య ప్రక్రియలో ఒక సూచిక మాత్రమే. అవి తుది తీర్పును నిర్ణయించే సాధనాలు కావు. గణాంకాలు ఒక దిశను చూపగలవు గానీ, ఓటరుల మనసులో జరిగే మార్పులను పూర్తిగా అంచనా వేయలేవు. ఎన్నికల రాజకీయాల్లో చివరి మాట ఎప్పుడూ ఓటరుదే. అది ఎలాంటి సర్వేలకు అందని, అంచనాలకు లోబడని ప్రజాతీర్పు. ఓటరు తన అనుభవం, జీవన పరిస్థితులు, స్థానిక సమస్యలు, నాయకత్వంపై నమ్మకం వంటి అనేక అంశాలను తూకం వేసి తన ఓటుద్వారా నిర్ణయం చెబుతాడు. అందువల్ల సర్వేలను గుడ్డిగా నమ్మడం ఎంత ప్రమాదకరో, పూర్తిగా విస్మరించడం కూడా అంతే అవివేకం. వాటిని ఒక సూచనగా మాత్రమే పరిగణిస్తూ, విమర్శనాత్మక దృష్టితో పరిశీలించడం ప్రజాస్వామ్య ఆరోగ్యానికి అవసరం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అసలు అధికారం ఎప్పటికీ ప్రజల చేతుల్లోనే ఉంటుంది.

– మేకల కృష్ణ

9948556978