
వికారాబాద్, వెలుగు: కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం మూడవ దశ ప్రారంభమైందని వికారాబాద్ జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ మహేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రముఖ కంపెనీల్లో ఇంటర్న్షిప్ కల్పించడం ద్వారా యువతకు వ్యాపారంపై అవగాహన పెంచడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమన్నారు. 18 నుంచి 25 ఏండ్ల వయస్సు ఉండి 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్ పూర్తి చేసిన అభ్యర్థులు దీనికి అర్హులని వెల్లడించారు.
డిగ్రీ, పీజీ చివరి సంవత్సరం చదువుతున్న వారు, దూరవిద్య విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని, కుటుంబ వార్షికాదాయం రూ. 12 లక్షల లోపు ఉండాలని సూచించారు. ఆరు నుంచి తొమ్మిది నెలల కాలపరిమితి ఉండే ఈ ఇంటర్న్‌షిప్‌లో నెలకు రూ. 9,000 స్టైఫండ్ అందజేస్తామని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు pminternship.mca.gov.in వైబ్‌సైట్‌ను చూడాలని, సహాయం కోసం 1800 11 6090 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని ఆయన కోరారు.