Reading Time: 2 minutes
Cv Anand New Telangana Dgp Appointment Upsc Panel Update

తెలంగాణ రాష్ట్రానికి కొత్త పోలీస్ బాస్ నియామక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. 1991వ బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి సి.వి. ఆనంద్ తెలంగాణ రాష్ట్ర తదుపరి పూర్తిస్థాయి డీజీపీగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో ఇన్-చార్జ్ డీజీపీగా కొనసాగుతున్న బి. శివధర్ రెడ్డి ఈ నెల 31న పదవీ విరమణ చేయనుండటంతో, ఆ స్థానంలో శాశ్వత ప్రాతిపదికన కొత్త అధికారిని నియమించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

ఈ నియామకం కోసం రాష్ట్రం పంపిన ఐదుగురు అధికారుల జాబితాను పరిశీలించిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC), ముగ్గురు అధికారులతో కూడిన ప్యానెల్‌ను రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఆ జాబితాలో సి.వి. ఆనంద్‌తో పాటు కేంద్ర ఇంటలిజెన్స్ బ్యూరో (IB) స్పెషల్ డైరెక్టర్‌గా ఉన్న వినాయక ప్రభాకర్ ఆప్టే , తెలంగాణ జైళ్ల శాఖ డీజీగా ఉన్న సౌమ్య మిశ్రాల పేర్లు ఉన్నాయి.

 Fake Property Sale: ఒక్క ప్రాపర్టీనే 25 మందికి అమ్మేశారు.. వీరి మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా..

అయితే, ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి పేరు ఈ సిఫార్సు జాబితాలో లేకపోవడంతో ఆయన పదవీ విరమణ అనివార్యం కాగా, సీనియారిటీ , రాష్ట్రంలో సుదీర్ఘ కాలం వివిధ హోదాల్లో పనిచేసిన అనుభవం దృష్ట్యా సి.వి. ఆనంద్ పేరుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. గతంలో రెండుసార్లు డీజీపీ పదవికి ఆయన పేరు పరిశీలనలోకి వచ్చినప్పటికీ సాంకేతిక కారణాల వల్ల అవకాశం దక్కలేదు, కానీ ఈసారి సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం శాశ్వత ప్రాతిపదికన ఆయన నియమితులయ్యే అవకాశం ఉంది.

ఈ నియామకానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు ఈ నెల 14వ తేదీ తర్వాత వెలువడే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ సి.వి. ఆనంద్ బాధ్యతలు చేపడితే, ఆయన పదవీ కాలం 2028 మే వరకు ఉంటుంది. మరోవైపు, మహిళా అధికారులకు కూడా ప్రాధాన్యత ఇస్తూ హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఒక మహిళా డీజీ స్థాయి అధికారిని నియమించాలని ప్రభుత్వం యోచిస్తోంది. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఏప్రిల్ 13 నాటికి డీజీపీ నియామకంపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉండటంతో, త్వరలోనే రాష్ట్ర పోలీస్ శాఖలో ఈ కీలక మార్పు చోటుచేసుకోనుంది.

Dhurandhar 2: బాక్సాఫీస్ విధ్వంసం.. 1,680 కోట్లతో ఇండియన్ సినీ హిస్టరీలో సరికొత్త మైలురాయి!