
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ శుక్రవారం రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేశారు. ఎగువసభ ఛైర్మన్ సిపి రాధాకృష్ణన్ చాంబర్‌లో సంక్షిప్తంగా జరిగిన కార్యక్రమంలో నితీష్‌తో ప్రమాణం చేయించారు. దీనితో బీహార్‌లో రెండు దశాబ్దాల ఆయన పాలన ముగుస్తుంది. రాష్ట్రంలో కొత్త ముఖ్యమంత్రి రాకకు దారి ఏర్పడింది. నితీష్ హిందీలో ప్రమాణం చేశారు. కేంద్ర మంత్రి, రాజ్యసభ నేత జెపి నడ్డా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పంచాయతీరాజ్ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, వ్యవసాయ, రైతుల సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామ్‌నాథ్‌ఠాకూర్, న్యాయ వ్యవహారాల సహాయ మంత్రి రామ్ మేఘ్వాల్ సమక్షంలో ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి కూడా హాజరయ్యారు. పలువురు నేతలు నితీష్‌ను ఈ సందర్భంగా అభినందించారు. ఆ తరువాత నితీష్ వెలుపలికి వచ్చి, అక్కడున్న విలేకరులతో మాట్లాడారు. తాను గతంలో లోక్‌సభ సభ్యుడిగా ఉన్నప్పుడు పార్లమెంట్‌కు వచ్చిన సందర్భం గుర్తుకు వస్తోందన్నారు.
తరువాత పాత పార్లమెంట్ భవనంలోకి వెళ్లి, కొద్ది సేపు తన మునుపటి సీట్లో కూర్చునివెళ్లారు. బీహార్‌లో కొత్త ముఖ్యమంత్రిని ఎంపికచేసుకునేందుకు ఎన్‌డిఎ శాసనసభాపక్షం ఈ నెల 14న సమావేశం అవుతుంది. దీనితో ఇన్నేళ్ల నితీష్ పదవీకాలం గత పుటల్లోకి వెళ్లుతుంది. పార్లమెంట్ ఎగువ సభకు ఎన్నిక కాగానే మార్చి 30వ తేదీన నితీష్ కుమార్ బీహార్ ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామా చేశారు. అత్యంత కీలకమైన ఉన్నత స్థాయి నిర్ణయాలలో భాగంగానే జెడియు అధినేత అయిన నితీష్‌ను సిఎం పదవి నుంచి జాతీయ రాజకీయాలలోకి తీసుకువెళ్లేందుకు తప్పించినట్లు రాజకీయ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలోనే ఆయన మార్చి 16న రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇప్పుడు ఆయనకు కేంద్రంలో ఏదైనా పదవి ఉంటుందని జాతీయ స్థాయిలో ప్రచారం జరుగుతోంది.