
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించడానికి పాక్ మధ్యవర్తిత్వంతో అమెరికా ఇరాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడడంతో ఒప్పందం గందరగోళంలో పడింది. ఒప్పందం లోని అంశాలను పాక్ సరిగ్గా వివరించలేకపోయిందని అమెరికా, ఇరాన్ దేశాలు మండిపడుతున్నాయి. పాక్ మధ్యవర్తిత్వంపై తమకు నమ్మకం లేదని ఇజ్రాయెల్ వెల్లడించింది. ఒకవైపు కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతిస్తూ, మరోవైపు లెబనాన్‌పై దాడులను సమర్ధించుకుంది. దక్షిణ లెబనాన్ నుంచి హెజ్‌బొల్లా మౌలిక సదుపాయాలను పూర్తిగా నిర్మూలించడమే తమ ప్రధాన లక్షంగా ఇజ్రాయెల్ ప్రకటించింది. యుద్ధం ముగింపునకు సంబంధించి పూర్తి స్థాయి ఒప్పందం అమలయ్యేవరకు తమ దేశానికి చెందిన యుద్ధ నౌకలు, బలగాలు, ఇరాన్ చుట్టూ మోహరించి ఉంటాయని ట్రంప్ స్పష్టం చేశారు. దీంతో తమ మిత్రదేశమైన లెబనాన్‌పై దాడులు కొనసాగడాన్ని ఇరాన్ సీరియస్‌గా తీసుకుని హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసివేసింది.
ఫలితంగా జలసంధి మీదుగా వెళ్లాల్సిన నౌకలు బలవంతంగా వెనక్కు మరలుతున్నాయి. హర్మూజ్ జలసంధిలో చిక్కుకుపోయిన నావికులకు కేంద్ర ప్రభుత్వం కీలక అడ్వైజరీ జారీ చేసింది. అవసరమైతే తప్ప బయటకు రావద్దని భారత నావికులను హెచ్చరించింది. ఇలాంటి చిక్కుల మధ్య ఇస్లామాబాద్ వేదికగా అమెరికా ఇరాన్ దేశాల మధ్య తొలిదశ చర్చలు శనివారం (11.4.2026) ప్రారంభం కానుండడం ప్రపంచ దేశాల మధ్య ఉత్కంఠను రేపుతోంది. అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ నేతృత్వంలో అమెరికా ప్రతినిధుల బృందం ఈ చర్చల్లో పాల్గొననున్నట్టు తెలుస్తోంది. అసలు ఈ యుద్ధం ప్రారంభించి ఉండాల్సిందే కాదు. యుద్ధానికి ముందు అమెరికా, ఇరాన్ దేశాల మధ్య అనేకసార్లు చర్చలు జరిగాయి. దాదాపు ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి ఖరారవుతున్న సమయంలో ఇజ్రాయెల్ శకునిపాత్ర వహించింది. ట్రంప్ తలంచుకుంటే ఏదైనా చేసేస్తారన్న రీతిలో తప్పుడు సంకేతాలిచ్చింది.
నెతన్యాహు రెచ్చగొట్టడంతో ఇరాన్‌పై అకస్మాత్తుగా బాంబు దాడులకు ట్రంప్ ఫిబ్రవరి 28న ఉత్తర్వు జారీ చేశారు. ఇరాన్ ప్రతిఘటనా సామర్థాన్ని ట్రంప్ తక్కువ అంచనా వేశారు. ఇరాన్ వెంటనే తన పాదాక్రాంతమవుతుందని భ్రమ పడ్డారు. దాదాపు గత నలభైరోజుల పాటు ఇరాన్‌పై భీకర దాడులతో అమెరికా ఇజ్రాయెల్ ఎంతగా విధ్వంసానికి పాల్పడినప్పటికీ ఇరాన్ దిగి రాలేదు. ఇప్పటికీ హర్ముజ్ జలసంధిని తెరిపించడానికి అమెరికాకు సులభమైన మార్గం ఏదీ దొరకలేదు. ఇప్పటికే ఎంతో ఆలస్యమైనా తన అంచనా తప్పేనని ట్రంప్ తెలుసుకుంటే అది పశ్చిమాసియాకు శుభవార్తే అవుతుంది. ఈ యుద్ధాన్ని నివారించడానికి బాధ్యతాయుతమైన, నిర్మాణాత్మకమైన పాత్రను పోషించి పాకిస్తాన్ అంతర్జాతీయ గుర్తింపు పొందింది. అటు అమెరికాను, ఇటు ఇరాన్‌ను సన్నిహితం చేయడానికి సహాయపడింది. కానీ కాల్పుల విరమణకు సంబంధించి అమెరికా 15 పాయింట్ల ప్రతిపాదనలకు, ఇరాన్ 10 పాయింట్ల ప్రతిపాదనకు మధ్య పొంతన కుదరక భారీ తేడా కనిపిస్తోంది.
లెబనాన్‌తో సహా అన్ని సంక్షోభాలకు ఈ ఒప్పందం పరిష్కారం అవుతుందని ఇరాన్, పాకిస్థాన్ ఆశించగా, ఒప్పందంలో లెబనాన్ సైనిక చర్య ప్రసక్తే లేదని అమెరికా, ఇజ్రాయెల్ కొట్టిపారేస్తున్నాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ కూడా తమకు ఇరాన్ నుంచి వేర్వేరుగా మూడు వెర్షన్ల ప్రతిపాదనలు అందాయని, తొలుత 10 పాయింట్లతో పంపిన ప్రతిపాదనలు ఛాట్ జిపిటి రాసినట్టుగా ఉండటంతో తిరస్కరణకు గురయ్యాయని చెప్పారు. ఇరాన్ పంపిన రెండో వెర్షన్ ప్రతిపాదనల గురించే ట్రంప్ ప్రస్తావించారన్నారు. మూడోసారి ఇరాన్ పంపిన ప్రతిపాదనలు మొదటిదానికంటే అత్యంత దారుణంగా, అంగీకరించలేని విధంగా డిమాండ్లు ఉన్నాయన్నారు. సోషల్ మీడియా ద్వారానే ఈ మూడో ప్రతిపాదన గురించి తమకు తెలిసిందని జెడి వాన్స్ ప్రకటించారు. లెబనాన్ కారణంగా కాల్పుల విరమణ ఒప్పందం విఫలం కాకుండా చూడాలని ఇరాన్‌ను జెడి వాన్స్ కోరారు. పర్షియన్ గల్ఫ్ లోని హర్ముజ్ జలసంధిని తాను నియంత్రణ లోకి తెచ్చుకుంటానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదేపదే హెచ్చరించినా అలా చేయడం అమెరికాకు ఆర్థికంగా ఎంతో నష్టమే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు.
ప్రపంచానికి సరఫరా అయ్యే చమురులో 20 శాతం ఈ జలసంధి మీదుగానే వెళ్తుందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ జలసంధిపై పట్టు సాధించాలంటే ఇరాన్ భూభాగం లోని దాదాపు 600 కి.మీ ప్రాంతంపై అమెరికా సైన్యం నియంత్రణ సాధించాలి. నౌకలపై క్షిపణులు ప్రయోగించకుండా ఇరాన్‌ను ఆపాలంటే 30,000 నుంచి 45,000 మంది సైనికులు అవసరం అవుతారు. అంతమందిని ఏళ్ల తరబడి అక్కడ నిర్వహించాలంటే అమెరికా ఎంతో వెచ్చించవలసి వస్తుంది. గతంలోఅఫ్గానిస్థాన్‌లో, వియత్నాంలో ఈ విధంగా సైనిక బలగాల నిర్వహణకు అమెరికా ఎంతో మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది. ఈ నేపథ్యంలో పశ్చిమాసియాలో శాంతి, సుస్థిరత కోసం ఇజ్రాయెల్, దాని సైనిక చర్యల కట్టడి చాలా అవసరం. ఇజ్రాయెల్ సైనిక చర్యలు హద్దులు మీరుతున్నాయని ఐక్యరాజ్యసమితి తోపాటు పలు అంతర్జాతీయ సంస్థలు, దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇజ్రాయెల్‌ను వెనకేసుకుని ట్రంప్ రాకుండా తనకు తాను నియంత్రించుకోవాలి. తాను సృష్టించుకున్న గందరగోళం నుండి తప్పించుకోడానికి రెచ్చగొట్టే ప్రసంగాలు, జాతి నిర్మూలన బెదిరింపులు వంటివి లేకుండా శాశ్వత శాంతికోసం కృషి చేయడంపై దృష్టి సారించాలి. అప్పుడే ఆయన పదవికి తగిన సమున్నత గౌరవం ప్రపంచ స్థాయిలో లభిస్తుంది.