Reading Time: 2 minutes

మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో ప్రభుత్వ భూమి కనిపిస్తే కబ్జా : బరితెగించిన భూ మాఫియా

Caption of Image.

సంగారెడ్డి జిల్లాలో అసైన్డ్ భూముల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఈ జిల్లాలో రికార్డుల ప్రకారం లక్షా 8 వేల187 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. ఈ జిల్లాలోని మొత్తం ప్రభుత్వ భూమి (1.61 లక్షల ఎకరాలు)లో మూడింట రెండు వంతులు అసైన్డ్ భూమే కావడం గమనార్హం. పారిశ్రామికీకరణ వేగంగా జరుగుతున్న పటాన్‌చెరు, అమీన్‌పూర్ వంటి ప్రాంతాల్లో అసైన్డ్ భూములను అక్రమంగా విక్రయించి.. రికార్డుల్లో పట్టా భూములుగా మార్చేసిన ఉదంతాలు కోకొల్లలు. దీనిపై ప్రభుత్వానికి వందల్లో కంప్లయింట్స్​వస్తున్నాయి. 

ఇక్కడ వెయ్యి 309 ఎకరాల్లో భూదాన్ భూములు ఉండగా, వాటిని కూడా వదలకుండా కబ్జాదారులు చెరబట్టారు.  అమీన్‌పూర్ మండలంలో ప్రభుత్వ గుట్టలను సైతం పిండి చేసి వెంచర్లుగా మారుస్తున్నారు. ఇక్కడ ఒకే భూమికి రెండు, మూడు రకాల రిజిస్ట్రేషన్లు ఉండడం.. సర్కారు రికార్డుల్లో ఒక పేరు.. క్షేత్రస్థాయిలో మరొకరి కబ్జాఉండటం గమనార్హం. విలువైన సీలింగ్ భూములను  కోర్టు కేసుల పేరుతో ఏళ్ల తరబడి అనుభవించడం ఇక్కడ భూ మాఫియాకు రోటిన్​గా మారింది. 

ఇక మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో పట్టణీకరణ పుణ్యమా అని అసైన్డ్ భూముల్లో అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. జిల్లాలో 1.21 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా.. అందులో  8 వేల 446 ఎకరాల అసైన్డ్ భూములు.. వెయ్యి 4 ఎకరాల్లో భూదాన్ భూములు ఉన్నాయి. కుత్బుల్లాపూర్, ఘట్‌కేసర్, కీసర వంటి ప్రాంతాల్లో ఖరీదైన ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి అపార్ట్‌మెంట్లు, విల్లాలు నిర్మించారు. ప్రభుత్వ సంస్థలకు కేటాయించిన  వేల ఎకరాల ‘పబ్లిక్ అసెట్స్’లో కూడా చొరబాట్లు జరగడం కలకలం రేపుతోంది. అక్రమ లేఅవుట్లకు అనుమతులు పొందడం, పాత తేదీలతో డాక్యుమెంట్లు సృష్టిస్తూ ఈ దందా కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది.

►ALSO READ | ప్రభుత్వ భూముల కబ్జాలో రంగారెడ్డి జిల్లా టాప్

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం  ప్రాంతంలో 226, 230, 164 సర్వే నెంబర్లలో సుమారు వెయ్యి 200 ఎకరాల సీలింగ్ భూమి అన్యాక్రాంతమైంది. ప్రధానంగా సర్వే నంబర్ 226లో చెరువు శిఖం భూములను సైతం మట్టితో నింపి వెంచర్లుగా మార్చారు. ఇక్కడ రికార్డుల్లో పట్టా భూములుగా మార్చడానికి రెవెన్యూ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసినట్లు గతంలో విచారణలో తేలింది. వందల ఎకరాల సీలింగ్ భూమిని ప్లాట్లుగా చేసి సామాన్యులకు అమ్మేశారు, ఇప్పుడు ప్రభుత్వం ఆ భూములను స్వాధీనం చేసుకోవాలంటే వేల ఇళ్లను కూల్చాల్సి వస్తోంది.

మేడ్చల్ మల్కాజ్‌‌‌‌‌‌‌‌గిరి జిల్లా కుత్బుల్లాపూర్ లోని సర్వే నంబర్ 329లో సుమారు 400 ఎకరాలకు పైగా సీలింగ్ భూమి ఉంది. అత్యంత ఖరీదైన ఈ ప్రాంతంలో భూమిని ప్రభుత్వం పేదలకు పంపిణీ చేయాలని భావించింది. కానీ, రియల్ మాఫియా పాత సాగు దారుల పేరుతో కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకుని, రాత్రికి రాత్రే షెడ్లు, ప్రహరీలు నిర్మించేసింది. సర్వే నంబర్ 79లో ప్రభుత్వ భూమిని సైతం ప్రైవేట్ పట్టా భూమిగా మార్చేసి లేఅవుట్లు వేశారు. ఇక్కడ ప్రభుత్వ బోర్డులు పెడితే కబ్జాదారులు వాటిని తొలగించి తమ బోర్డులు పెట్టుకోవడం గమనార్హం

©️ VIL Media Pvt Ltd.