Reading Time: 2 minutes

అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఆయన, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. గత ఏడాది ఢిల్లీలోని ఆయన నివాసంలో కాలిపోయిన కరెన్సీ నోట్ల కట్టలు బయటపడిన ఘటన తర్వాత ఆయనను తొలగించేందుకు అభిశంసన ప్రక్రియకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజా పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటన 2025 మార్చి 14న హోలీ పండుగ రాత్రి సుమారు 11:35 గంటలకు లూటియన్స్ ఢిల్లీలోని న్యాయమూర్తి వర్మ నివాసంలో అగ్నిప్రమాదం సంభవించిన తర్వాత వెలుగులోకి వచ్చింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చిన సమయంలో భారీ మొత్తంలో నగదు నిల్వలు ఉన్నట్లు వెల్లడైంది. ఆ సమయంలో వర్మ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా సేవలందిస్తున్నారు.

ఏప్రిల్ 9న రాష్ట్రపతికి పంపిన లేఖలో 57 ఏళ్ల వర్మ, గాఢమైన మనోవేదనతో ఈ రాజీనామాను సమర్పిస్తున్నాను. ఈ పదవిలో సేవ చేయడం నాకు గౌరవంగా భావిస్తున్నాను అని పేర్కొన్నారు. తన నిర్ణయానికి గల కారణాలను వివరించాల్సిన అవసరం లేదని కూడా లేఖలో తెలిపారు. వర్మ రాజీనామాతో ఆయనను పదవి నుండి తొలగించేందుకు చేపట్టిన అభిశంసన ప్రక్రియ ప్రయోజనం లేకుండా పోయింది. దీనికి ముందు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి అరవింద్ కుమార్, మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మనీంద్ర మోహన్ శ్రీవాస్తవ, సీనియర్ న్యాయవాది బీవీ ఆచార్యలతో కూడిన మూడు సభ్యుల కమిటీ విచారణ నిర్వహిస్తోంది.ఈ కేసులో అనేక మలుపులు చోటుచేసుకున్నాయి. ఇద్దరు న్యాయమూర్తుల ప్రతికూల నివేదికల అనంతరం అప్పటి ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా ఇచ్చిన రాజీనామా సలహాను వర్మ తిరస్కరించారు.

దీంతో ఖన్నా రాష్ట్రపతికి లేఖ రాసి అభిశంసన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం వర్మను ఢిల్లీ హైకోర్టు నుండి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు. ఇదిలా ఉండగా, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆమోదించిన అభిశంసన తీర్మానాన్ని, దర్యాప్తు కమిటీ చెల్లుబాటు అంశాన్ని సవాలు చేస్తూ వర్మ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు జనవరి 16న తిరస్కరించింది. పార్లమెంటరీ ప్రక్రియను అడ్డుకునేందుకు చట్టంలోని నిబంధనలను ఉపయోగించలేమని స్పష్టం చేసింది. గత ఏడాది ఆగస్టు 12న బహుళ పార్టీల మద్దతుతో ఆయనను తొలగించే తీర్మానాన్ని స్పీకర్ ఆమోదించారు. 2025 మార్చి 22న సుప్రీంకోర్టు తన వెబ్‌సైట్‌లో వర్మ నివాసంలో నగదు నిల్వలపై అంతర్గత విచారణ నివేదికను, అసాధారణ చర్యగా ఫొటోలు, వీడియోలతో సహా ప్రచురించింది. అదే రోజు అప్పటి సీజేఐ ఖన్నా త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు.

ఇదిలా ఉండగా, తనపై వచ్చిన ఆరోపణలను వర్మ ఖండించారు. నా కుటుంబ సభ్యులు లేదా నేను ఎప్పుడూ స్టోర్‌రూమ్‌లో నగదు ఉంచలేదు. ఆ నగదు మాకు సంబంధించినదని చెప్పడం పూర్తిగా తప్పుడు ఆరోపణ అని ఆయన స్పష్టం చేశారు. అలాగే విచారణ కమిటీ ఇచ్చిన దర్యాప్తు నివేదికను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అయినా అత్యున్నత న్యాయస్థానంలోనూ ఆయనకు ఊరట దక్కలేదు. సుప్రీం ఆయన పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఇక అభిశంసనకు సిఫారసు చేస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీలకు సుప్రీం ప్రధాన న్యాయమూర్తి లేఖలు రాశారు. జస్టిస్ వర్మను విధుల నుంచి తొలగించాలని కోరుతూ పార్లమెంటు ఉభయ సభల్లో ఎంపీలు అభిశంసన తీర్మానాన్ని చేశారు. ఈ రాజీనామాతో అభిశంసన ప్రక్రియ ముగిసిపోతుందని లోక్‌సభ సెక్రటేరియట్‌వర్గాలు మీడియాకు వెల్లడించాయి.